Buffalo |
విధాత: నీటి పన్ను చెల్లించని ఓ వ్యక్తికి మున్సిపల్ అధికారులు (Municipal Officials) షాకిచ్చారు. అతను పెంచుకుంటున్న బర్రె(Buffalo)ను తీసుకెళ్లారు. నీటి పన్నును చెల్లించిన తర్వాతే బర్రెను విడిచిపెడుతామని అధికారులు స్పష్టం చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లోని గ్వాలియర్ మున్సిపల్ కార్పొరేషన్ (Gwalior Municipal Corporation ) పరిధిలోని బాల్‌కిషన్ పాల్ అనే వ్యక్తి డెయిరీ ఫాం (Dairy Farm) నిర్వహిస్తున్నాడు. అయితే అతనికి మున్సిపల్ అధికారులు.. రూ. 1.39 లక్షల నీటి పన్ను (Water Tax) ను జారీ చేశారు. ట్యాక్స్‌ను సకాలంలో కట్టాలని పాల్‌కు అధికారులు ఆదేశించారు. కానీ పాల్ అధికారుల మాట పట్టించుకోలేదు.
దీంతో మార్చి 25వ తేదీన మున్సిపల్ అధికారులు బాల్‌కిషన్ పాల్ ఇంటికి చేరుకుని, అతను పెంచుకుంటున్న ఓ బర్రెను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం దాన్ని మున్సిపల్ ఆఫీసుకు తరలించారు.
ఈ సందర్భంగా.. గ్వాలియన్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కిశోర్ కన్యాల్ మాట్లాడుతూ.. సకాలంలో నీటి పన్ను చెల్లించని యెడల.. సదరు వ్యక్తి ఆస్తులను జప్తు చేసేందుకు చర్యలు చేపడుతామన్నారు. బాల్ కిషన్‌కు నోటీసులు జారీ చేసినప్పటికీ పన్ను చెల్లించలేదని, ఈ నేపథ్యంలో అతని బర్రెను తీసుకెళ్లామని తెలిపారు. పాల్ పేరు మీద రూ. 1.39 లక్షల నీటి బిల్లు పెండింగ్‌లో ఉందని పేర్కొన్నారు.