- అక్టోబర్ 7న బంధించిన ఇజ్రాయెలీలతో పాలస్తీనా ఖైదీల మార్పిడి
- మృతదేహాలు కూడా పరస్పర అప్పగింతలు
- ఇజ్రాయెల్ దళాలు గాజా నుంచి పూర్తిగా వైదొలగాలి
- గాజా పునర్నిర్మాణ పనులు ప్రారంభించాలి
- ఇజ్రాయెల్‌తో యుద్ధం అంతానికి హమాస్ ప్రతిపాదన
గాజా : ఇజ్రయెల్ దళాలతో యుద్ధాన్ని ముగించేందుకు హమాస్ మూడంచెల కాల్పుల విరమణను ప్రతిపాదించింది. 135 రోజుల పాటు.. ఉండే ఈ ప్రతిపాదనలో అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు బందీలుగా తీసుకున్న ఇజ్రాయెల్ పౌరులను పాలస్తీనా ఖైదీలతో మార్పిడి, తదితర అంశాలు ఉన్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ మద్దతుతో ఖతార్, ఈజిప్ట్ దేశాల మధ్యవర్తుల బృందం గతవారం పంపిన ప్రతిపాదనకు స్పందనగా నాలుగున్నర నెలలపాటు కాల్పుల విరమణకు సిద్ధమని వెల్లడించింది.
ఈ కాలంలో గాజా పునర్నిర్మాణం ప్రారంభించడం, గాజా నుంచి ఇజ్రాయెల్ దళాలు పూర్తిగా వైదొలగడం, మృతదేహాలు, ఇతరత్రా పరస్పర మార్పిడి వంటి అంశాలు కూడా హమాస్ ప్రతిపాదనలో ఉన్నాయి.
ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధాన్ని నివారించేందుకు అత్యంత కీలక దౌత్యపరమైన చొరవలో భాగంగా అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఖతార్, ఈజిప్ట్ మధ్యవర్తులతో మాట్లాడి ఇజ్రాయెల్ చేరుకున్నారు.
హమాస్ ప్రతిపాదనల ప్రకారం.. వారి వద్ద బందీలుగా ఉన్న మహిళలు, 19 ఏళ్లలోపు పురుషులు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారిని తొలి 45 రోజుల్లో విడుదల చేస్తారు. ఇందుకు ప్రతిగా ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న పాలస్తీనా మహిళలు, చిన్న పిల్లలను ఆ దేశం అప్పగించాల్సి ఉంటుంది. మిగిలిన పురుషులను రెండో దశలో విడుదల చేస్తారు. మూడో దశలో మృతదేహాలను, ఇతరాలను పరస్పరం మార్పడి చేసుకోవాల్సి ఉంటుంది.
మూడో దశ ముగిసే నాటికి యుద్ధానికి ముగింపు పలికేలా ఇరుపక్షాలు ఒక ఒప్పందానికి రావాలని హమాస్ ప్రతిపాదించింది. అయితే.. ఇజ్రాయెల్ జైల్లో ఉన్న 1500 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేయాలని, అందులో ఇజ్రాయెల్ జీవిత ఖైదు విధించిన వారిని తాము ఎంపిక చేసుకుంటామని షరతు పెట్టింది. కాల్పుల విరమణ సమయంలో ఆహారం, ఇతర సహాయాలు గాజాలోకి పంపడాన్ని పెంచాల్సి ఉంటుంది.
2023 అక్టోబర్ ఏడవ తేదీన ఇజ్రాయెల్‌పై ఆకస్మిక దాడులు చేసిన హమాస్.. 1200 మందిని చంపి, 253 మందిని బందీలుగా పట్టకున్నది. దీనికి ప్రతిగా ఇజ్రాయెల్ దళాలు గాజాపై జరిపిన దాడిలో 27,585 మంది చనిపోయారని గాజా ఆరోగ్య శాఖ పేర్కొంటున్నది. శిథిలాల కింద వేల సంఖ్యలో సమాధి అయి ఉంటారని అంచనా వేసింది.