- ఆపరేషన్ సిందూర్ విజయాలకు.. బ్రేక్ వేసిందా?
- దేశ సైనిక పాటవాన్ని చాటిన ఆపరేషన్ సిందూర్
- దౌత్య విధానాలపై రేకెత్తిన ప్రశ్నలు
(విధాత ప్రత్యేకం)
India-Pakistan ceasefire | పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్.. భారత్, పాక్ మధ్య కుదిరిన సీజ్‌ఫైర్‌తో తాత్కాలిక బ్రేక్ పడింది. పాకిస్తాన్‌లోని ఉగ్రమూకల అంతమే లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్ లక్ష్యాలు ఎంతవరకు సాధ్యమయ్యాయనే అంశాలతోపాటు.. అంతర్జాతీయంగా ఎదుర్కొన్న పరిణామాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. కాల్పులు విరమించినప్పటికీ.. దౌత్యపర యుద్ధంలో భాగంగా సింధూ జలాల ఒప్పందం, వీసాల నిలిపివేత, విమానయాన ఆంక్షలు అలాగే కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో ఆపరేషన్ సిందూర్ కొనసాగుతూనే ఉంటుందని భారత వైమానిక దళం ప్రకటించడం తాజా పరిణమాల్లో మరో ఆసక్తికర అంశంగా మారింది. వంచనకు మారుపేరుగా మారిన పాక్ వక్రబుద్ధి చరిత్రను చూసే ఆపరేషన్ సిందూర్ ముగిసిపోలేదంటూ ఐఏఎఫ్ ప్రకటించి ఉంటుందని యుద్ధ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అందుకే సరిహద్దుల్లోనూ.. వాయు.. జల మార్గాల్లోనూ భారత్ బలగాల మోహరింపు యథాతథంగా కొనసాగిస్తున్నదని చెబుతున్నారు. ఇప్పటికే ఆపరేషన్ సిందూర్‌కు కౌంటర్‌గా ‘ఆపరేషన్ బున్యాన్ ఉన్ మర్సుస్’ పేరుతో సైనిక చర్యను ప్రకటించుకోవడంతో రెండు దేశాల మధ్య ఉద్రికత్తలు నివురు గప్పిన నిప్పుగానే ఉండనున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఆపరేషన్ సిందూర్ లక్ష్యాలు నెరవేరినట్లేనా?
ఆపరేషన్ సిందూర్ లక్ష్యాల మేరకు పాకిస్తాన్ సహా పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసి.. 100మందికి పైగా ఉగ్రవాదులను భారత ఆర్మీ విజయవంతంగా హతమార్చగలిగింది. పాక్ పౌరుల ప్రాణాలు, ఆస్తులకు నష్టం వాటిల్లకుండా భారత్ కచ్చితమైన దాడులను నిర్వహించి తీరు భారత ఆయుధ బలాన్ని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కచ్చితంగా లక్ష్యాలను చేధించడంలో మన సైనిక సామర్ధ్యం విశ్వవ్యాప్తంగా ప్రదర్శితమైందన్నది వాస్తవం. భారత్‌లోని సరిహద్దు రాష్ట్రాల్లో 26 చోట్ల దాడులకు పాల్పడింది. వాటన్నింటినీ భారత్ ఆర్మీ విజయవంతంగా తిప్పికొట్టింది. ఆపరేషన్ సింధూర్‌తో త్రివిధ దళాల ఉమ్మడి సైనిక వ్యూహం భారత్‌కు మరిన్ని విజయాలు అందించగలదన్న సందేశంతో పాటు ప్రపంచ దేశాలకు ఈ వ్యూహం గొప్పతనాన్ని ప్రదర్శితం చేసింది. అయితే ఆపరేషన్ సిందూర్‌తో ఉగ్రవాదం నిర్మూలనపై భారత్ నిబద్ధత ప్రపంచానికి మరోసారి వెలడైందని చెప్పవచ్చు. ఉగ్రవాదానికి పాకిస్తాన్ ఊతమిస్తున్న అంశాన్ని ప్రపంచ దేశాల ముందు భారత్ మరింత సమర్ధంగా చాటగలిగింది.
ఉగ్రవాద స్థావరాల విధ్వంసం అసంపూర్ణమే
ఆపరేషన్ సిందూర్ లో భాగంగా పాక్, పీవోకేలలోని 42 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. తొమ్మిది స్థావరాలను ధ్వంసం చేయగానే పాకిస్తాన్ సైనిక చర్యకు ఉపక్రమించి యుద్ద పరిస్థితులను తీసుకొచ్చింది. రెండు దేశాల మధ్య సైనిక చర్యలు యుద్దానికి దారితీయవచ్చన్న ఆందోళనల నేపథ్యంలో అమెరికా..సౌది అరేబియాల చొరవతో భారత్ పాక్ లు కాల్పుల విరమణ అంగీకారానికి వచ్చాయి. దీంతో మిగిలిపోయిన ఉగ్రస్థావరాల నిర్మూలన లక్ష్యం అసంపూర్తిగానే మిగిలింది. దీనిపై భారత ప్రభుత్వం స్పష్టతనివ్వాల్సి ఉంది.
తొలుత పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సిందూర్ దాడులను నిర్వహించిన సందర్భంలో అంతర్జాతీయ సమాజంలో దాదాపుగా ఏకాకిని చేయడంలో విజయం సాధించిన భారత్ ప్రభుత్వం… పాక్ తో పరస్పర దాడులకు వచ్చే సరికి ఆ స్థాయి మద్దతు నిలుపుకోలేక కాల్పుల విరమణకు రావడాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇందులో తెర వెనుక దౌత్య కారణాలు.. అమెరికా పాత్ర ఏమిటన్నది అధికారికంగా తేలాల్సిఉంది. ఇప్పటిదాకా కశ్మీర్ సహా పాకిస్తాన్ తో ఘర్షణలపై మూడో శక్తి జోక్యం అంగీకరించేది లేదన్న భారత విదేశాంగ విధానం ఆపరేషన్ సిందూర్ సందర్భంగా అమెరికా జోక్యానికి అంగీకరించే స్థాయికి ఎలా మారిందన్నది కూడా అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నది. అమెరికా తమ దేశంపై దాడికి పాల్పడిన బిన్ లాడెన్ ను మరో దేశంలోకి వెళ్లి హతమారిస్తే తప్పులేదుగాని.. అదే పని భారత్ చేస్తే మాత్రం శాంతిపేరుతో అడ్డుకోవడం, దానికి మోదీ అంగీకారం తెలియజేయడం కూడా సందేహాలకు దారి తీస్తున్నది.
కాల్పుల విరమణ సరైందేనా..?
పాకిస్తాన్ తో యుద్ద పరిస్థితులను ఎదుర్కొనేందుకు భారత్ సర్వసైనిక, దౌత్య శక్తులను కూడతీసుకుని కూడా నాలుగు రోజుల సైనిక సంఘర్షణకే కాల్పుల విరమణకు ఎందుకు అంగీకరించిందన్న అంశం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. అందవులోనూ అమెరికా జోక్యంతో కాల్పుల విరమణ అంగీకారం చేసుకోవడం దేశ ప్రజలను సైతం ఆశ్చర్యపరిచింది. అమెరికా మాట విని భారత్ శాంతి మంత్రం పఠిస్తే.. భవిష్యత్తులో ఉగ్ర దాడులు జరిగితే ఎవరిది బాధ్యత? అమెరికాదా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కాంగ్రెస్ తదితర విపక్షాలు ప్రధాని మోదీని తక్షణమే పార్లమెంటును సమావేశ పరిచి ఆపరేషన్ సిందూర్.. కాల్పుల విరమణ దాకా జరిగిన పరిణామాలను చర్చించాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. కాల్పుల విరమణ నిర్ణయం వెనుక వాస్తవాలను దేశం ముందుంచాలని పట్టుబడుతున్నాయి. అదే సమయంలో యుద్ధం అనేది రెండు ప్రభుత్వాల రాజకీయ ప్రయోజనాల కోసం సాగేదే కానీ.. ప్రజల ప్రయోజనాల కోసం కాదని బుద్ధిజీవులు వ్యాఖ్యానిస్తున్నారు. యుద్ధ రంకెల్లో అసలు వాస్తవాలు మరుగునపడిపోతాయని, ఉద్రేకపూరిత, ఉద్వేగ భరిత మానసిక బ్లాక్‌మెయిలింగ్ ఇందులో ఉంటుందని చెబుతున్నారు. పహల్గామ్‌లో అంతటి భయానక మారణకాండకు ఎవరు కారణమనే రాజకీయ చర్చ నడిస్తే.. అన్ని వేళ్లూ ప్రభుత్వంవైపూ చూపుతాయి. అంతటిదాకా పరిస్థితిని తెచ్చుకోకుండా.. వ్యూహాత్మకంగానే దేశాన్ని యుద్ధానికి సిద్ధం చేశారన్న అభిప్రాయాలూ ఉన్నాయి. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పినవారిపై నిర్బంధాలూ ప్రయోగించిన పరిస్థితిని పలువురు గుర్తు చేస్తున్నారు. అలా సలహాలు ఇచ్చినవారిని కొందరు బీభత్స పదజాలాలతో దూషించిన సంగతిని గుర్తు చేస్తున్నారు. చర్చలే వద్దన్నవారు ఇప్పుడు అమెరికా చెబితే ఎందుకు చర్చలకు సిద్ధమయ్యారన్నది ప్రశ్న. దీని వెనుక ఎవరి ఒత్తిళ్లు ఉన్నాయి? ఎవరి ప్రయోజనాలు ఉన్నాయి? అన్నది కూడా తేలాల్సిందే.
ఇవి కూడా చదవండి..
Operation Sindoor | పీవోకేను మాకు అప్పజెప్పాలి.. ఉగ్రవాదులను సరెండర్ చేయాలి : ఇవే తమ డిమాండ్లన్న మోదీ!
Snake in Train | వేగంగా దూసుకుపోతున్న రైలు.. టాయ్‌లెట్‌లో పాము!
Pulwama attack | పుల్వామా ఉగ్రదాడిలో తమ ప్రమేయం ఉందన్న ఔరంగజేబ్
Bhu Bharati | అందుబాటులోకి ‘భూ భారతి’ వెబ్‌సైట్.. భూముల రిజిస్ట్రేషన్‌కు మార్గదర్శకాలు ఇవే..!
ఎక్కువ మంది చదివిన వార్తలు
Tectonic Interactions | మీరు నమ్మలేరు.. రెండు ముక్కలుగా చీలనున్న భారతదేశం!
SkyLab | హమ్మయ్య.. అండమాన్ సమీపంలో కూలిన ‘స్కైలాబ్’
IAS Srilakshmi | ఒక్క పదం తొలగించినందుకు నిత్య నరకం.. ఐఏఎస్‌లకు ఈమె కేసు పెద్ద గుణపాఠం!
eggs found in volcano | వేల గుడ్లను పొదుగుతున్న అగ్నిపర్వతం? ఎక్కడ.. ఆ కథేంటి?
Life on Mars | అంగారకుడిపై ఒకప్పుడు నదీ వ్యవస్థలు, సరస్సులు!.. భూమిలాంటి వాతావరణం?
Giant Persons | రాక్షసులు నిజంగానే ఈ భూమిపై ఉండేవారా? వారి కథేంటి?