Pulvama attack | న్యూఢిల్లీ : కశ్మీర్ లోని పుల్వామాలో 40మంది పారా మిలటరీ సిబ్బంది మరణానికి కారణమైన ఉగ్రదాడి వెనుక పాక్ మిలటరీ హస్తం ఉందని వాయుసేన ఎయిర్ వైస్ మార్షల్ ఔరంగజేబ్ అహ్మద్ సంచలన ప్రకటన చేశారు. ఆదివారం అంతర్జాతీయ మీడియా సమావేశంలో మాట్లాడుతూ 2019 ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా ఉగ్రదాడిని పాక్ వ్యూహాత్మక ప్రతిభగా అభివర్ణించుకున్నారు. ఆపరేషన్ సిందూర్ పరిణామాలపై లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి తో పాటు త్రివిధ దళాధికారులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. పాక్ కు చెందిన గగన, వాయు, జల సరిహద్దులకు ముప్పు ఏర్పడితే రాజీపడబోమని దీటుగా ఎదుర్కొంటామని తెలిపారు. మా దేశ ప్రజల కీర్తి మా సైనిక దళాలపైన ఉందని..మేం దానిని నిలబెట్టుకుంటామన్నారు.
గతంలో పుల్వమాలో తమ వ్యూహాత్మక నైపుణ్యం, సామర్ధ్యం ప్రదర్శించామని చెప్పుకొచ్చారు. కాగా పాక్ ఎయిర్ వైస్ అధికారి ఔరంగజేబ్ అహ్మద్ తాజా వ్యాఖ్యలతో పుల్వామా దాడి పాక్ పనేనని తేలిపోయింది. ఇంతకాలం పుల్వామా దాడితో మాకు సంబంధం లేదన్న పాక్ ప్రభుత్వ వాదన బూటకమన్న సంగతి కూడా స్పష్టమైందని భారత్ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల పాక్ రక్షణ శాఖ మంత్రి సైతం అమెరికా వంటి దేశాల ప్రోద్బలంతోనే తాము ఉగ్రమూకలను పెంచి పోషించాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు. తాజాగా ఆపరేషన్ సిందూర్ లో హతమైన ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాక్ సైనిక అధికారులు, ప్రభుత్వ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ పరిణామాలన్నీ కూడా భారత్ లో ఇస్లామిక్ ఉగ్రవాదానికి పాక్ వెన్నుదన్నుగా నిలుస్తుందనడానికి రుజువులని భారత్ వాదిస్తున్నది.