Site icon vidhaatha

HighCourt | డెక్క‌న్ కిచెన్‌ను ఎలా కూల్చేస్తారు?: GHMCపై హైకోర్టు సీరియస్‌

HighCourt |

హైద‌రాబాద్‌, విధాత‌: జూబ్లీహిల్స్ ఫిల్మ్‌న‌గ‌ర్‌లోని డెక్క‌న్ కిచెన్ కూల్చివేత‌పై హైకోర్టు సీరియ‌స్ అయ్యింది. ఎమ్మెల్యేలకు ఎర కేసు నిందితుడు నందకుమార్‌కు చెందిన డెక్కెన్‌ కిచెన్‌ను ఆదివారం జీహెంచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు. దీంతో డబ్ల్యూ3 హాస్పిటాలిటీ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్ హైకోర్టును ఆశ్రయించింది.

అయితే గ‌త విచార‌ణ‌లో భాగంగా ఈ కేసులో ప్ర‌తివాదులుగా ఉన్న జీహెచ్ఎంసీ అధికారులు మంగ‌ళ‌వారం కోర్టుకు హాజ‌రు కావాల‌ని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయినా వారు కోర్టుకు హాజ‌రు కాక‌పోవ‌డంతో హైకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. దీంతో కోర్టులో స్టే ఉండ‌గా డెక్క‌న్ కిచెన్‌ను ఎలా కూల్చుతార‌ని జీహెచ్ఎంసీ అధికారుల‌ను ప్ర‌శ్నించింది.

ఆదివారం రోజు అంత అత్య‌వ‌స‌రంగా కూల్చివేయాల్సిన అవ‌స‌రం ఏముంద‌ని నిల‌దీసింది. ప్ర‌తివాదులంద‌రూ కోర్టు ధిక్క‌ర‌ణ ఎదుర్కోవాల్సిందేన‌ని స్ప‌ష్టం చేసింది. జీహెచ్ ఎంసీ మాజీ క‌మిష‌న‌ర్ లోకేశ్‌కుమార్‌తోపాటు ప్ర‌తివాదులంద‌రూ గురువారం కోర్టుకు హాజ‌రు కావాల్సిందేన‌ని హైకోర్టు ఆదేశించింది.

కూల్చివేత జ‌రిగే ముందు డెమోలిష‌న్ ఆర్డ‌ర్స్ ఇచ్చారా? కూల్చివేత స‌మ‌యంలో ఎంతమంది పోలీస్ అధికారులు అక్క‌డ ఉన్నారో చెప్పాల‌ని ప్ర‌శ్నించింది. కోర్టు ధిక్క‌ర‌ణ చేస్తే ఎలా ఉంటుందో రాష్ర్టంలోని ప్ర‌తీ ఆఫీస‌ర్ ఈ కేసుతో తెలుసుకోవాల‌ని న్యాయమూర్తి కన్నెగంటి లలిత తీవ్ర తీవ్రంగా హెచ్చ‌రించింది. కూల్చివేత‌పై పూర్తి నివేదిక ఇవ్వాల‌ని ఆదేశిస్తూ త‌దుప‌రి విచార‌ణ‌ను గురువారానికి వాయిదా వేసింది.

Exit mobile version