నెత్తురోడిన కాంకేర్‌.. ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌

లోక్‌సభ ఎన్నికలకు ముందు ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకున్నది

  • Publish Date - April 16, 2024 / 06:10 PM IST

29 మంది మావోయిస్టుల హతం
మృతుల్లో అగ్రనేత శంకర్‌రావు
భారీగా ఆయుధాలు స్వాధీనం
ముగ్గురు భద్రతా సిబ్బందికి గాయాలు
కాంకేర్‌ : లోక్‌సభ ఎన్నికలకు ముందు ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకున్నది. కాంకేర్‌ జిల్లాలోని చోటే బిటియా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బినగుండ గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతం మంగళవారం ఒక్కసారిగా కాల్పులతో దద్దరిల్లిపోయింది. ఈ ఘటనలో మావోయిస్టు అగ్రనేతల్లో ఒకరైన శంకర్‌రావు సహా 29 మంది మావోయిస్టులు చనిపోయారు. శంకర్‌రావుపై 25 లక్షల రివార్డు ఉన్నది. ఈ ఘటనలో ఒక బీఎస్‌ఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌, ఇద్దరు డీఆర్జీ పోలీసులు గాయపడ్డారు. వారిని తొలుత స్థానిక హాస్పిటల్‌కు తరలించి, అనంతరం మెరుగైన చికిత్స కోసం వేరే దవాఖానకు మార్చారు. సంఘటనా స్థలం నుంచి ఏడు ఏకే 47 తుపాకులు, మూడు ఎంఎంజీలు, ఒక ఇన్‌సాస్‌ రైఫిల్‌ సహా, పెద్ద ఎత్తున ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. పది మంది మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని అంటున్నారు. గాయపడిన జవాన్లను హాస్పిటల్‌కు తరలించారు. మధ్యాహ్నం 1.30 గంటలకు ఎదురుకాల్పులు మొదలైనట్టు తెలుస్తోంది. కాంకేర్‌ జిల్లాలో ఏప్రిల్‌ 26న రెండో దశలో పోలింగ్‌ జరుగనున్నది. మావోయిస్టు ఆపరేషన్ల కోసం డీఆర్జీని 2008లో ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. డీఆర్జీతోపాటు బీఎస్‌ఎఫ్‌ జవాన్లు కూంబింగ్‌ ఆపరేషన్‌ నిర్వహించిన సందర్భంగా తాజా ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఇదే జిల్లాలో గత నెలలో ఒక ఎన్‌కౌంటర్‌ జరిగింది. అందులో ఇద్దరు మావోయిస్టులు, ఒక పోలీసు చనిపోయారు. డీఆర్జీ, బస్తర్‌ ఫైటర్స్‌తోపాటు బీఎస్‌ఎఫ్‌ జవాన్లు ఆ ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్నారు. కాంకేర్‌లో ఫిబ్రవరిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కూడా ముగ్గురు మావోయిస్టులు చనిపోయారు. గత ఏడాది నవంబర్‌ నెలలో రాష్ట్ర అసెంబ్లీ తొలి విడత ఎన్నికలకు సిద్ధమవుతున్న సమయంలో ఇదే జిల్లాలో ఎన్‌కౌంటర్‌ జరిగింది.

Latest News