Tomato
విధాత: టమాటా ధరలు ఆకాశాన్నంటాయి. దీంతో గృహిణులు టమాటాను చాలా తక్కువగా వాడుతున్నారు. అసలు టమాటా లేకుండానే కూరలను చేస్తున్నారు. అయితే ఓ హోటల్ యజమాని తన భార్యకు తెలియకుండా కూరలో రెండు టమాటాలు వేశాడు. దీంతో భార్య అలిగి తన కూతుర్ని తీసుకొని ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని షాహ్‌దోల్ జిల్లాలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. షాహ్‌దోల్ జిల్లాకు చెందిన సంజీవ్ బుర్మాన్ స్థానికంగా ఓ టిఫిన్ సెంటర్ నడుపుతు న్నాడు. టమాటా ధరలు భారీగా పెరగడంతో కొన్ని రోజుల నుంచి టమాటా లేకుండానే కూరలు వండుతున్నారు.
అయితే తన భార్యకు తెలియకుండా ఓ రెండు టమాటాలు కూరలో వేశాడు. తనకు తెలియకుండా కూరలో ఎందుకు టమాటాలు వేశావని భర్తతో భార్య గొడవ పడింది. ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.
దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన భార్య తన కూతుర్ని తీసుకొని ఇంటి నుంచి వెళ్లిపోయింది. గత మూడు రోజుల నుంచి భార్య ఆచూకీ కోసం ఎంత వెతికినా లాభం లేకుండా పోయింది. చివరకు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బుర్మాన్ భార్య, కూతురి కోసం ఆచూకీ కోసం వెతుకుతున్నారు