హైదరాబాద్ : న్యూ ఇయర్ వేడుకలకు హైదరాబాద్ నగరం ముస్తాబవుతోంది. ఈ నేపథ్యంలో నగర ప్రజలను దృష్టిలో ఉంచుకొని మెట్రో సర్వీసుల సమయాన్ని పెంచాలని మెట్రో ఎండీ నిర్ణయించారు. డిసెంబర్ 31వ తేదీన అర్ధరాత్రి వరకు మెట్రో సర్వీసులను నడపాలని నిర్ణయం తీసుకున్నారు. అర్ధరాత్రి 12:15 గంటలకు మెట్రో రైళ్లు అందుబాటులో ఉండనున్నాయి. చివరి మెట్రో రైళ్లు 12:15 గంటలకు బయల్దేరి, రాత్రి ఒంటి గంట సమయానికి గమ్యస్థానాలకు చేరుతాయని తెలిపారు. మెట్రో రైలు, స్టేషన్లలో సిబ్బంది, పోలీసుల నిఘా ఉంటుందని ఎండీ పేర్కొన్నారు. మెట్రో స్టేషన్లలోకి మద్యం సేవించి వచ్చినా, దుర్భాషలాడినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రయాణికులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు.