Site icon vidhaatha

Kavitha: లేఖ రాయడంలో నా తప్పేమీ లేదు : ఎమ్మెల్సీ కవిత

విధాత, హైదరాబాద్ : బీఆర్ఎస్ అధినేత, తన తండ్రి కేసీఆర్ కు నేను పార్టీలోని అంశాలపై లేఖ రాయడంలో తప్పు లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా పర్యటనలో ఉన్న కవిత మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడుతూ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నో ఆవేదనలు భరించలేకనే తాను లేఖ రాశానని, లేఖను బయటకు తెచ్చినవారిని పట్టుకోండని బీఆర్ఎస్ నాయకత్వాన్ని కవిత డిమాండ్ చేశారు. నా లేఖను లీక్ చేయడం వెనుక ఎవరి ప్రమేయం ఉందో తేలాలన్నారు. నాకంటూ ప్రత్యేకంగా జెండా.. అజెండా లేదని, పార్టీని కాపాడుకోవడమే నా అజెండా అని కవిత స్పష్టం చేశారు. కేసీఆర్‌ తప్ప మరో నాయకత్వాన్ని నేను ఒప్పుకోనని మరోసారి కుండబద్దలు కొట్టారు. బీఆర్ ఎస్ పార్టీ బీజేపీ వైపు చూడొద్దు అని నేను కోరుతున్నానన్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీలు బాగుపడలేదన్నారు. బీజేపీలో బీఆర్ఎస్ ను విలీనం చేస్తామంటే ఒప్పుకోనని కవిత తెగేసి చెప్పారు. కేసీఆర్ కలిసే అవకాశం వచ్చిందని..అయితే తాను కలవలేకపోయానన్నారు.


అస్సలు తగ్గేదేలే అంటున్న కవిత!

బీఆర్ఎస్ పార్టీ తనను ఎంత టార్గెట్ చేసినా, కేటీఆర్ అనుచరులు సోషల్ మీడియాలో తనపై ఎన్ని ట్రోల్స్ చేసినా తాను మాత్రం ఎక్కడా తగ్గకుండా కవిత జిల్లాల పర్యటనలు కొనసాగిస్తున్నారు. నిన్న మేడ్చల్ జిల్లా శామీర్ పేట మండలం సేవాలాల్ మల్లన్న తాండలో భోగ్ బండారా, భోనాల వేడుకల్లో పాల్గొని హుషారుగా డ్యాన్స్ చేశారు. ఈరోజు శుక్రవారం మంచిర్యాల జిల్లాలో పర్యటిస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్తూ మార్గమధ్యలో పెద్దపల్లి పట్టణంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు.
అనంతరం గోదావరిఖనిలో డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.

Exit mobile version