Mamata Banerjee
విధాత: తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee) కీలక వ్యాఖ్యలు చేశారు. రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి సీఎం మమత ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మమతా బెనర్జీ మాట్లాడుతూ.. ద్వేషపూరిత రాజకీయాలతో ఈ దేశాన్ని విభజించేందుకు కొంతమంది నాయకులు యత్నిస్తున్నారని ఆమె మండిపడ్డారు.
దేశ విభజనను అడ్డుకుంటామని, ఈ దేశం కోసం ప్రాణాలర్పిస్తానని మమత కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ద్వేషపూరితంగా విభజన రాజకీయాలకు పాల్పడుతున్న భారతీయ జనతా పార్టీని ఓడించాలని మమత(Mamata Banerjee) ప్రజలకు పిలుపునిచ్చారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చేందుకు కాషాయ శిబిరం యత్నిస్తుందని బెంగాల్ సీఎం ఆరోపించారు. పశ్చిమ బెంగాల్‌లో ఎన్ఆర్‌సీ అమలును అనుమతించే ప్రసక్తే లేదని ఆమె స్పష్టం చేశారు. కేంద్ర ఏజెన్సీ సంస్థలను అడ్డం పెట్టుకుని ప్రతిపక్ష పార్టీలను బీజేపీ నిర్వీర్యం చేస్తుందన్నారు.
బీజేపీ ప్రభుత్వంపై పోరాడేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. తానెవరికీ తల వంచను అని తేల్చిచెప్పారు మమత. మరో ఏడాది కాలంలో లోక్‌సభ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో విభజన శక్తులకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడుదామని ప్రతి ఒక్కరూ వాగ్దానం చేయాలన్నారు. మనందరం కలిసి వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని మమతా బెనర్జీ(Mamata Banerjee) పిలుపునిచ్చారు.