IAS Officer Srilakshmi: ఓఎంసీ కేసులో ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఓబుళాపురం అక్రమమైనింగ్ కేసులో ఆమెకు విముక్తి కల్పిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం ధర్మాసనం కొట్టివేసింది. ప్రతివాదుల వాదనలను పరిగణలోకి తీసుకోకుండా హైకోర్టు తీర్పు ఇచ్చిందని సీబీఐ వాదనలు వినిపించింది. సీబీఐ వాదనతో సుప్రీం కోర్టు ఏకీభవించింది. మళ్లీ శ్రీలక్ష్మి కేసును తాజాగా విచారించాలని తెలంగాణ హైకోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. మూడు నెలల్లోగా విచారణను ముగించాలని హైకోర్టును సుప్రీం ఆదేశించింది. ఓబులాపురం మైనింగ్స్‌లో అక్రమాలు జరిగాయంటూ సీబీఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితురాలిగా ఐఏఎస్ అధికారిణిని శ్రీలక్ష్మి అరెస్ట్ అయి కొంత కాలం జైలు జీవితం కూడా అనుభవించారు. 2022లో హైకోర్టు శ్రీలక్ష్మిని ఈ కేసు నుంచి డిశ్చార్జ్ చేసిన విషయం తెలిసిందే. ఆ డిశ్చార్జ్ పిటిషన్‌పై హైకోర్టు నిర్ణయాన్ని తాజాగా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో నిందితులకు మంగళవారం హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టు శిక్ష విధించిన విషయం తెలిసిందే. ప్రధాన నిందితులైన గాలి జనార్దనరెడ్డితో పాటు బి.వి.శ్రీనివాసరెడ్డి, వి.డి.రాజగోపాల్, మెఫజ్ అలీఖాన్‌లకు, ఓబుళాపురం మైనింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ కు ఒక్కొక్కరికి కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష, రూ.20 వేల చొప్పున జరిమానా విధించింది. ప్రభుత్వ ఉద్యోగి అయిన రాజగోపాల్‌కు అదనంగా 4 ఏళ్ల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధించారు. నిందితులు జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా ఆరు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని పేర్కొన్నారు. ఓబుళాపురం మైనింగ్ కార్పొరేషన్‌కు రూ.2 లక్షల జరిమానా విధించారు. వేర్వేరు సెక్షన్ల కింద వేర్వేరుగా ఏడేళ్లు శిక్షలు పడినప్పటికీ ఏకకాలంలో అనుభవించాలని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు. ఇప్పటికే జైలులో అనుభవించిన శిక్షను మినహాయింపునిచ్చారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న మాజీ మంత్రి సబిత, ఐఏఎస్ కృపానందంను నిర్దోషిగా ప్రకటిస్తూ సీబీఐ కోర్టు కీలకమైన తీర్పును వెల్లడించింది.