MP Raghunandan Rao: తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను పట్టించుకోకపోవడం పట్ల బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను ఫిబ్రవరి 1 నుంచి అనుమతిస్తామని చైర్మన్ బీఆర్.నాయుడు ఆధ్వర్యంలో టీటీడీ నిర్ణయించిందన్నారు. మార్చి నెల గడిచిపోతున్నా తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను అనుమతించకపోవడంపై రఘునందన్ రావు అసంతృప్తి వ్యక్తం చేశారు.
చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను అనుమతిస్తామని చెప్పాక కూడా స్పందన లేకపోవడం విచారకరమన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 294 మంది ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలకు టీటీడీ అనుమతి ఇచ్చేదని..కానీ ఇప్పుడు కేవలం ఏపీ ప్రజాప్రతినిధుల సిఫార్సులను మాత్రమే టీటీడీ పరిగణలోకి తీసుకుంటుందని..ఇది చాలా బాధాకరమైన విషయమన్నారు. దీనిపై టీటీడీ మరోసారి ఆలోచన చేయాలని ఎంపీ రఘునందన్ రావు కోరారు.
ఏపీ సీఎం ఆదేశించినా..టీటీడీ నిర్ణయించినా కూడా తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసుల లేఖలు ఎందుకు అనుమతించడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల పట్ల ఈ వివక్షత సమంజసం కాదని..వెంటనే టీడీడీ బోర్డు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి దీనిపై నిర్ణయం తీసుకోవాలని కోరారు. వేసవి సెలవులలో వచ్చే భక్తులకు తాము సిఫారసు లేఖలు ఇస్తామని..తీసుకోకపోతే తెలంగాణ ప్రజాప్రతినిధులమంతా తిరుమలకు వచ్చి తేల్చుకుంటామని రఘునందన్ రావు హెచ్చరించారు.