Site icon vidhaatha

వాయువ్య భారతాన్ని కమ్మేసిన పొగమంచు..! విపరీతంగా పెరిగిన చలి.. మరో మూడురోజులు ఇదే పరిస్థితి..!

విధాత‌: జమ్మూకశ్మీర్ నుంచి హిమాచల్ ప్రదేశ్.. పంజాబ్, హర్యానా నుంచి రాజస్థాన్, బీహార్ వరకు వాయువ్య భారతదేశాన్ని దట్టమైన పొగమంచు కమ్మేసింది. దానికి తోడు తీవ్రమైన చలిగాలులు వీస్తున్నాయి. దీంతో జనం అల్లాడిపోతున్నారు. ఇటీవల కొద్దిరోజులుగా ఎత్తైన ప్రాంతాల్లో మంచు కురుస్తుండటంతో మైదాన ప్రాంతాల్లో చలితీవ్రత విపరీతంగా పెరిగింది. రాబోయే రెండు మూడురోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణశాఖ హెచ్చరించింది.


ఇప్పటికే రెండురోజులుగా దేశ రాజధాని ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లో ఉదయం నుంచి దట్టంగా పొగమంచు కమ్మేసింది. దీంతో ఢిల్లీలో పలు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతున్నది. దృశ్యమానత తక్కువగా ఉండడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పంజాబ్‌లోని అమృత్‌సర్, రాజస్థాన్‌లోని చురులో పొగమంచు కారణంగా ఆదివారం ఉదయం దృశ్యమానత దాదాపు చాలా తక్కువగా ఉంది.


జమ్మూ కశ్మీర్‌లో హిమపాతం కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకనున్నది. శ్రీనగర్ వాతావరణ కేంద్రం ప్రకారం, జనవరి 1 నుంచి 3 వరకు రాష్ట్రం మేఘావృతమై ఉంటుంది. కొన్ని చోట్ల వర్షం, మరికొన్ని చోట్ల మంచు కురుస్తుంది. ప్రస్తుతం కశ్మీర్‌లో చలిగాలులు వీస్తుండటంతో చాలా జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రత సున్నా కంటే తక్కువగా నమోదైంది. శ్రీనగర్‌లో ఉష్ణోగ్రత మైనస్ 2.1 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది.


పహల్గామ్‌లో మైనస్ 3.9 డిగ్రీల సెల్సియస్, గుల్‌మార్గ్‌లో మైనస్ 3.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. లేహ్‌లో కనిష్ఠ ఉష్ణోగ్రత మైనస్ 7.8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో వాయు కాలుష్యం కొనసాగుతూనే ఉన్నది. ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) ఆదివారం సాయంత్రం 4 గంటలకు 411 వద్ద నమోదైంది. శనివారం 450 నమోదు కాగా.. వాయు కాలుష్యంతో జనం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

Exit mobile version