Site icon vidhaatha

సెకనుకు 2.5 బిర్యానీల ఆర్డర్.. బిర్యానీకే జై కొట్టిన హైద‌రాబాదీలు


విధాత‌: హైద‌రాబాదీలు ఈ ఏడాది కూడా బిర్యానీకే జై కొట్టారు. సెకనుకు 2.5 బిర్యానీల ఆర్డర్ ఇచ్చారు. అత్య‌ధికంగా కేక్‌లు ఆర్డ‌ర్ ఇచ్చిన బెంగ‌ళూరు కేక్ క్యాపిటల్‌గా నిలిచింది. గ‌తంలో పోలిస్తే ఈ ఏడాది వినియోగ‌దారుల నుంచి శాకాహార ఆర్డ‌ర్లు 146 శాతం పెరిగాయి. దేశంలో వాలెంటైన్స్ డే నాడు నిమిషానికి 271 కేక్‌ల ఆర్డ‌ర్లు వ‌చ్చాయి. ఈ మేర‌కు ప్ర‌ఖ్యాత ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ Swiggy శుక్ర‌వారం త‌న వార్షిక నివేదిక‌ను విడుద‌ల చేసింది. హౌ ఇండియా స్విగ్గి’డ్ 2023’ని వరుసగా 8వ సంవత్సరం వెల్ల‌డించింది. భారతీయులు ఏయే ఆహారాలను ఎక్కువగా ఆర్డర్ చేశారు? ఎంత చేశారు? ఎక్కడి నుంచి చేశారు? వంటి ఆసక్తికరమైన విషయాలను నివేదిక ప్ర‌క‌టించింది.


ఎవరు ఏమి ఆర్డర్ చేసారు అంటే..


దేశవ్యాప్తంగా స్విగ్గీ మెనూలో 6.6 మిలియన్లకు పైగా ప్రత్యేకమైన వంటకాలు అందుబాటులో ఉన్నాయి. అయినా, కొంతమంది వినియోగదారుల‌కు తాము కోరుకున్న‌5,028 వంట‌కాలు ల‌భించ‌లేవు. ముంబైలోని ఒక వ్యక్తి రూ.42.3 లక్షల విలువైన ఆహార ప‌దార్థాల‌ను ఆర్డ‌ర్ చేశారు. ముంబై వంటి పెద్ద నగరాలే కాకుండా ఝాన్సీ వంటి చిన్న పట్టణాలు కూడా చాలా ఆహార ఆర్డ‌ర్లు వ‌చ్చిన‌ట్టు నివేదిక వెల్ల‌డించింది. ఒక వినియోగదారు పార్టీ కోసం ఒకేసారి 269 వస్తువులను ఆర్డర్ చేసిన‌ట్టు తెలిపింది. జైపూర్‌లోని ఒక వినియోగదారు ఒకే రోజులో 67 ఆర్డర్‌లు చేశారు. ఢిల్లీలో ఇన్‌స్టంట్ నూడుల్స్ డెలివరీ కేవలం 65 సెకన్ల‌లోనే జ‌రుగుతున్న‌ది.


 


దుర్గాపూజ సందర్భంగా ర‌స‌గుల్లాల‌పై గులాబ్ జామూన్స్ 7.7 మిలియన్ ఆర్డర్ల‌తో పైచేయి సాధించింది. నవరాత్రి మొత్తం తొమ్మిది రోజులకు టాప్ వెజ్ ఆర్డర్‌గా మసాలా దోస టాప్‌లో నిలిచింది. హైదరాబాద్‌లో ఒక కస్టమర్‌ ఏకంగా 6 లక్షలు వెచ్చించి ఇడ్లీలు అర్డర్ ఇచ్చారు. సెక‌నుకు 2.5 బిర్యానీలను వినియోగ‌దారులు ఆర్డర్ చేయడం వ‌ల్ల‌ వరుసగా ఎనిమిదో సంవత్సరం కూడా అత్యధిక‌ ఆర్డర్ పొందిన వంటకంగా బిర్యానీ తన స్థానం నిల‌బెట్టుకున్న‌ది.


చాక్లెట్ కేక్‌ కోసం 8.5 మిలియన్ల ఆర్డర్‌లతో ‘కేక్ క్యాపిటల్’ టైటిల్‌ను బెంగళూరు పొందింది. వాలెంటైన్స్ డే సందర్భంగా భారతదేశ వ్యాప్తంగా నిమిషానికి 271 కేక్‌ల ఆర్డ‌ర్లు వ‌చ్చాయి. స్విగ్గీ గిల్ట్‌ఫ్రీలో శాకాహార‌ ఆర్డర్లు 146% పెరిగాయి. జపనీస్ వంటకాల ఆర్డ‌ర్లు రెండు రెట్లు పెరిగాయి.

Exit mobile version