World Largest Building
ప్రపంచ అతిపెద్ద కార్యాలయ భవనంగా గుజరాత్‌లోని సూరత్ డైమండ్ బోర్సే భవనం నిలిచింది. ఈ క్రమంలో ఇది అమెరికా (America) రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్‌ను అధిగమించిందని సీఎన్ఎన్ కథనం పేర్కొంది. వజ్రాల రాజధానిగా పేరు పొందిన సూరత్ (Surat) లో నూతనంగా నిర్మించిన ఈ భవనం… వజ్రాల నిపుణులకు ప్రధాన కేంద్రంగా ఉండనుంది.
మొత్తం 35 ఎకారల్లో నిర్మించిన ఈ సూరత్ డైమండ్ బోర్సె భవనంలో 15 అంతస్తులు ఉంటాయి. ఇలా మొత్తం 9 కట్టడాలు ఒకదానికొకటి అనుసంధానించారు. ప్రముఖ భారతీయ ఆర్కిటెక్చర్ సంస్థ మార్ఫోజెనిసిస్ దీనిని నిర్మించింది. సుమారు 70 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ భవనంలో ఒకేసారి 65,000 మంది పని చేసుకోవచ్చు. డైమండ్ కట్టర్లు, పోలిషర్లు, ట్రేడర్‌లు మొదలైన వారు ఇందులో ఉంటారు. మొత్తం డైమండ్ పరిశ్రమకు ఏకైక కేంద్రంగా ఉండేలా ఈ కట్టడాన్ని రూపొందించారు.
ఈ భవన ప్రారంభోత్సవం ప్రధాని నరేంద్రమోదీ చేతులమీదుగా ఈ ఏడాది నవంబరులో జరగనుంది. మొత్తం నిర్మాణానికి నాలుగేళ్లు పట్టగా.. ఇది మొదలైతే డైమండ్లకు సంబంధించిన వివిధ పనులకు ఇక ముంబయి వెళ్లాల్సిన అవసరం ఉండదని స్థానిక వ్యాపారులు అభిప్రాయపడ్డారు. ఇప్పటికే భవనంలోని కార్యాలయాలన్నింటినీ వివిద డైమండ్ వ్యాపార సంస్థలు బుక్ చేసేసుకోవడం విశేషం. ఎస్‌డీబీ డైమండ్ బోర్సే అనే సంస్థ లాభాపేక్షలేని పద్ధతిలో చొరవ తీసుకుని ఈ భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.