Site icon vidhaatha

Inter-Caste Marriages: కులాంతర వివాహాలు..40మందికి శిరోముండనం !

విధాత : ఆధునిక నాగరిక సమాజంలోనూ కులాంతర వివాహాల పట్ల వివక్షత కొనసాగుతుంది. కులాంతర పెళ్లిళ్లు చేసుకున్న వారు పరువు హత్యలు..కుల బహిష్కరణలు వంటి దారుణాల బారిన పడుతున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా ఒరిస్సాలో కులాంతర వివాహం చేసుకున్న యువతి కుటుంబ సభ్యులకు శిరో ముండనం చేసిన అనాగరిక చర్య సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒరిస్సాలో కులాంతరం వివాహం చేసుకున్న యువతి కుటుంబ సభ్యులకు గ్రామ పెద్దలు శిరోముండనం శిక్ష విధించారు. 40 మందికి ఒకే సారి సాముహిక శిరోముండనం నిర్వహించి శిక్షను అమలు చేశారు.

గోరఖ్ పూర్ పంచాయతీలోని గ్రామానికి చెందిన ఆదివాసీ యువతి, షెడ్యూల్ కులానికి చెందిన యువకుడిని ప్రేమించి కుటుంబ సభ్యులను కాదని ప్రేమపెళ్లి చేసుకుంది. అనంతరం వధువరులు గ్రామానికి రావడంతో గ్రామకట్టుబాట్ల మేరకు యువతి కుటుంబ సభ్యులను ఊరి నుంచి వెలివేశారు. గ్రామ బహిష్కరణ నుంచి తప్పించుకోవాలంటే శిరోముండనానికి అంగీకరించి, మూగ జీవులను బలి ఇచ్చి..నూతన జంటకు పెద్ద కర్మ చేయాలని గ్రామపెద్దలు తీర్పునిచ్చారు. చేసేది లేక యువతి కుటుంబ సభ్యులు, బంధువులు 40మంది శిరోముండనం చేసుకుని..మేక, గొర్రె, కోడి, పావురాలను బలి ఇచ్చి కర్మ పూజలు చేశారు. గ్రామంలో ఇంత జరుగుతున్న అక్కడి పోలీసులకు మాత్రం సమాచారం అందకపోవడం విడ్డూరం.

 

 

Exit mobile version