యశోదా హాస్పిటల్స్‌పై ఐటీ సోదాలు.. 162 కోట్ల బాండ్లు కొన్న దవాఖాన

ఎలక్టోరల్‌ బాండ్లను రద్దు చేస్తూ.. ఆ స్కీం ప్రారంభించిన దగ్గర నుంచి ఇప్పటి వరకూ ఎవరెవరు ఎంత మొత్తంలో బాండ్లు కొనుగోళ్లు చేశారో వెల్లడించాలని

  • Publish Date - March 17, 2024 / 02:52 PM IST

ఎలక్టోరల్‌ బాండ్లు బెదిరించి కొనిపించారా?

శరత్‌రెడ్డి అరెస్టయిన ఐదు రోజులకే 5 కోట్ల బాండ్లు కొన్న అరబిందో ఫార్మా

షిర్డిసాయి ఎలక్ట్రికల్స్‌దీ అదే కథ

న్యూఢిల్లీ : ఎలక్టోరల్‌ బాండ్లను రద్దు చేస్తూ.. ఆ స్కీం ప్రారంభించిన దగ్గర నుంచి ఇప్పటి వరకూ ఎవరెవరు ఎంత మొత్తంలో బాండ్లు కొనుగోళ్లు చేశారో వెల్లడించాలని సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆసక్తికర సంగతులు వెలుగు చూస్తున్నాయి. ఎక్కువ మొత్తంలో ఎలక్టోరల్ బాండ్లను ఐటీ సోదాలు ఎదుర్కొన్న కంపెనీలు, వ్యక్తులు కొనుగోలు చేసి ఉండటం అనేక అనుమానాలకు దారితీస్తున్నది. ఐటీ సోదాలు నిర్వహించిన కొద్దికాలానికే సదరు కంపెనీలు ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేసినట్టు వెల్లడవుతున్నది. ఇప్పటికే విరాళాల జాబితాలో టాప్‌లో ఉన్న ఫ్యూచర్‌ గేమింగ్‌ 1368 కోట్ల మేరకు ఎలక్టోరల్‌ బాండ్లు కొనుగోలు చేసినట్టు తేలింది. ఈ కంపెనీ మనీలాండరింగ్‌ కేసు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇవే కాకుండా చిన్నాచితక సంస్థలు, వ్యక్తుల నుంచి కూడా ఐటీ సోదాలను అడ్డుపెట్టుకుని ఎలక్టోరల్‌ బాండ్లు కొనుగోలు చేయించారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. 2020లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన హైదరాబాద్‌కు చెందిన యశోదా హాస్పిటల్స్‌.. పలు విడుతలుగా 2021 అక్టోబర్‌, 2023 అక్టోబర్‌ మధ్యకాలంలో 162 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేసింది. ఢిల్లీ లిక్కర్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అరబిందో ఫార్మా డైరెక్టర్‌ శరత్‌ రెడ్డి అరెస్టయిన ఐదు రోజులకే తొలుత 5 కోట్ల విలువ చేసే బాండ్లను, తదుపరి 25 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేయడం గమనార్హం. మొత్తంగా అరబిందో ఫార్మా పలు విడుతల్లో 52 కోట్ల విలువైన బాండ్లు కొనుగోలు చేసింది. ఏపీకి చెందిన షిర్డిసాయి ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌పై 2023, డిసెంబర్‌ 18న ఐటీ సోదాలు నిర్వహించగా.. 2024 జనవరి 11వ తేదీన ఆ కంపెనీ 40 కోట్లు విలువ చేసే ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసింది. ఇక రియల్‌ఎస్టేట్‌ డెవలప్‌మెంట్‌ కంపెనీ కల్పతరు ప్రాజెక్ట్స్‌ ఇంటర్నేషనల్‌ డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్‌ల నివాసాలు, కార్యాలయాల్లో 2023 ఆగస్ట్‌లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించగా.. సదరు కంపెనీ అదే ఏడాది ఏప్రిల్‌ నుంచి అక్టోబర్‌ మధ్యకాలంలో 25.5 కోట్ల విలువైన ఎలక్టోరల్‌ బాండ్లను కొనుగోలు చేసింది. వీటిని గమనిస్తే.. అనేక అనుమానాలు కలుగుతున్నాయి.