Site icon vidhaatha

మునుగోడులో ఓట్లు కాదు.. నోట్ల వరద పారింది : జై రాం రమేశ్

Jai Ram Ramesh | మునుగోడు ఉప ఎన్నిక ఫలితంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జై రాం రమేశ్ తీవ్రంగా స్పందించారు. మునుగోడులో ఓట్లు కాదు.. నోట్ల వరద పారిందని ఆయన ధ్వజమెత్తారు. ఆ ఉప ఎన్నిక ఓట్లతో కూడినది కాదని, నోట్లతో కూడినదని ఆరోపించారు. మునుగోడులో ప్రజాస్వామ్యం హత్యకు గురైందని మండిపడ్డారు.

మునుగోడులో విజయం సాధించింది మద్యం, సంపదలే అని విమర్శించారు. ఇద్దరు కోటీశ్వరుల మధ్య తమ అభ్యర్థి పాల్వాయి స్రవంతి గట్టిగా పోరాడారని పేర్కొన్నారు. ఉప ఎన్నిక ఫ‌లితంపై పూర్తిస్థాయిలో స‌మీక్ష చేసుకుని మ‌రింత ఉత్సాహంతో ముందుకు వెళ్తామ‌ని జై రాం రమేశ్ పేర్కొన్నారు.

రాజగోపాల్ రెడ్డి ఓటమి సంతోషాన్నిచ్చింది..

రాజ‌గోపాల్‌రెడ్డి ఓడిపోవ‌డం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని జైరాం తెలిపారు. తెలంగాణ‌లో వ‌న్ సీఆర్‌, టూసీఆర్‌, త్రీసీఆర్‌, ఫోర్ సీఆర్‌.. కేసీఆర్ అని గ‌ద్ద‌ర్ చెప్పిన మాట నిజ‌మే అనిపిస్తున్న‌ది. సీఆర్ అంటే అంద‌రికీ అర్థ‌మైంది క‌దా. అక్క‌డ పూర్తిగా అధికార యంత్రాంగాన్ని మోహ‌రించారు.

అక్క‌డ ఓట‌మితో కాంగ్రెస్ పార్టీ నిరాశ చెంద‌డం లేద‌న్నారు. మా పార్టీ పోరాటం కొన‌సాగుతుంద‌న్నారు. వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్‌, కాంగ్రెస్ మ‌ధ్యే పోటీ ఉంటుంద‌ని జై రాం రమేశ్ స్పష్టం చేశారు. మునుగోడులో పాల్వాయి స్రవంతి మూడో స్థానానికి పరిమితమై డిపాజిట్ కోల్పోయిన సంగతి తెలిసిందే.

Exit mobile version