Site icon vidhaatha

JEE Advanced | జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫ‌లితాలు విడుద‌ల‌.. ఫ‌స్ట్ ర్యాంక‌ర్ మ‌నోడే..

JEE Advanced | దేశ వ్యాప్తంగా ఉన్న ఐఐటీల్లో బీటెక్ కోర్సుల్లో ప్ర‌వేశాల నిమిత్తం నిర్వ‌హించే జేఈఈ అడ్వాన్స్‌డ్ -2023 ఫ‌లితాలు ఆదివారం ఉద‌యం 10 గంట‌ల‌కు విడుద‌ల‌య్యాయి. ఫ‌లితాల‌ను జేఈఈ అధికారిక వెబ్‌సైట్ http://jeeadv.ac.in లో అందుబాటులో ఉంచిన‌ట్లు అధికారులు తెలిపారు.

ఈ ఫ‌లితాల్లో ఐఐటీ హైద‌రాబాద్ జోన్‌కు చెందిన వావిలాల చిద్విలాస్ రెడ్డి 360 మార్కుల‌కు గానూ 341 మార్కులు సాధించి ఫ‌స్ట్ ర్యాంక‌ర్‌గా నిలిచాడు. అమ్మాయిల విభాగంలో కూడా ఐఐటీ హైద‌రాబాద్ జోన్‌కు చెందిన నాయ‌కంటి భావ్య శ్రీ 298 మార్కులు సాధించి ప్ర‌థ‌మ స్థానంలో నిలిచింది. ఐఐటీ ముంబైలో కంప్యూట‌ర్ సైన్స్ ఇంజినీరింగ్ చ‌దువుతాన‌ని చిద్విలాస్ రెడ్డి మీడియాకు వెల్ల‌డించాడు. వావిలాల చిద్విలాస్ రెడ్డి స్వ‌స్థ‌లం.. ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలోని నాగ‌ర్‌క‌ర్నూల్‌.

క‌టాఫ్ మార్కులు నిర్ణ‌యించి సుమారు 45 వేల మంది విద్యార్థుల‌కు జాయింట్ సీట్ అల‌కేష‌న్ ఆథారిటీ(JoSAA) కౌన్సెలింగ్‌కు అర్హ‌త క‌ల్పించ‌నున్నారు. అర్హ‌త క‌లిగిన వారు ఈ నెల 19 నుంచి ప్రారంభ‌మ‌య్యే కౌన్సెలింగ్ ప్ర‌క్రియలో త‌మ పేరును రిజిస్ట్రేష‌న్ చేసుకోవ‌చ్చు.

గ‌తేడాది 23 ఐఐటీల్లో మొత్తం 16,598 సీట్లు ఉండ‌గా, ఈ సంఖ్య ఈ ఏడాది పెరిగే అవ‌కాశం ఉంది. ఈ నెల 4వ తేదీన దేశ వ్యాప్తంగా నిర్వ‌హించిన జేఈఈ అడ్వాన్స్‌డ్ ప‌రీక్ష‌కు 1.80 ల‌క్ష‌ల మంది హాజ‌ర‌య్యారు. ఇక తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల నుంచి 30 వేల మంది విద్యార్థులు ప‌రీక్ష రాశారు.

టాప్ టెన్ ర్యాంక‌ర్లు వీరే..

1. వావిలాల చిద్విలాస్ రెడ్డి(ఐఐటీ హైద‌రాబాద్ జోన్)
2. ర‌మేశ్ సూర్య తేజ‌(ఐఐటీ హైద‌రాబాద్ జోన్)
3. రిషి క‌ల్రా(ఐఐటీ రూర్కీ జోన్)
4. రాఘ‌వ్ గోయ‌ల్(ఐఐటీ రూర్కీ జోన్)
5. అడ్డ‌గ‌డ వెంక‌ట శివ‌రాం(ఐఐటీ హైద‌రాబాద్ జోన్)
6. ప్ర‌భ‌వ్ ఖండేవాల్(ఐఐటీ ఢిల్లీ జోన్)
7. బిక్కిన అభిన‌వ్ చౌద‌రి(ఐఐటీ హైద‌రాబాద్ జోన్)
8. మ‌లాయ్ కేడియా(ఐఐటీ ఢిల్లీ జోన్)
9. నాగిరెడ్డి బాలాజీ రెడ్డి(ఐఐటీ హైద‌రాబాద్ జోన్)
10. య‌క్కంటి ఫ‌ణి వెంక‌ట మ‌ణింధ‌ర్ రెడ్డి(ఐఐటీ హైద‌రాబాద్ జోన్)

Exit mobile version