విధాత: ముఖ్యమంత్రి, గౌవర్నర్ మధ్య ఉన్న పొరపొచ్చాలు రిపబ్లిక్ దినోత్సవాలను కళావిహీనం చేశాయి. రాజ్యాంగ అవతరణ దినోత్సవంగా పరిగణించే జనవరి 26 గణతంత్ర దినోత్సవ వేడుకలు ఏదో మమ అన్న చందంగా ముగిశాయి. వరుసగా రెండో సారి గణతంత్ర వేడుకలకు ముఖ్యమంత్రి కేసీఆర్ గైర్హాజరయ్యారు. దీంతో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో అట్టహాసంగా వీనులవిందుగా సాగాల్సిన ఉత్సవాలు తూతూ మంత్రంగా గవర్నర్ నివాసం రాజ్‌భవన్‌లో నిర్వహించబడ్డాయి.
గణతంత్ర వేడుకలు ఏటా సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించే వారు. ఇది 2019దాకా ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగింది. కరోనా పరిస్థితుల కారణంగా మొదటిసారి 2020సంవత్సరం రిపబ్లిక్ వేడుకలను నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్‌కు మార్చారు. చిన్న ప్రదేశమైన పబ్లిక్ గార్డెన్‌లో పరేడ్ నిడివిని తగ్గించి నిర్వహించారు. ఆ తర్వాతి సంవత్సరం 2021లో కూడా పబ్లిక్ గార్డెన్స్‌లోనే జరిపారు.
ఈ మధ్య కాలంలో దేశంలో గవర్నర్ వ్యవస్థనే చర్చనీయాంశం చేసే దిశగా చర్చలు కొనసాగుతున్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గవర్నర్ వ్యవస్థ మాటున విపక్ష పార్టీల రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బందులకు గురిచేసే చర్యలకు దిగుతున్నదని, గవర్నర్ వ్యవస్థను తమ రాజకీయాలకు ఆయుధంగా వాడుకుంటున్న దన్న విమర్శలు ఊపందుకున్నాయి. తమిళనాడు, పశ్చిమబెంగాల్, కేరళ తదితర రాష్ట్రాల్లో గవర్నర్ల వ్యవహార శైలి తీవ్ర విమర్శలకు తావిచ్చింది.
2022 వచ్చే నాటికి గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ మధ్య విభేదాలు పొడసూపాయి. ఇవి ఒక రకంగా బీజేపీకి, స్థానిక బీఆర్‌ఎస్ పార్టీకి ఆధిపత్య పోరుగా మారిపోయాయి. బడ్జెట్ ప్రసంగాలకు గవర్నర్‌ను ఆహ్వానించని దుస్థితి ఏర్పడింది. గత బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగం లేకుండానే ముగిశాయి. ఈ సారి కూడా గవర్నర్ ప్రసంగం ఉండే వాతావరణం కనిపించటం లేదు.
ఈ నేపథ్యంలోంచే.. ప్రభుత్వ కార్యకలాపాల్లో గవర్నర్ పాత్ర, ప్రమేయం ఎక్కడా కనిపించని పరిస్థితి ఏర్పడింది. దీనిపై గవర్నర్ తమిళిసై రాష్ట్ర ప్రభుత్వం ప్రొటో కాల్ పాటించటం లేదని ఆరోపించటం గమనార్హం. ఖ్యమంత్రి మధ్య విభేదాలు జాతీయ వేడుకలపైన కూడా ప్రభావం చూపటం అనూహ్యం. ఈ నేపథ్యంలోనే.. తాజా గణతంత్ర వేడుకలు కూడా రాజ్ భవన్‌లో నిర్వహించాలని ప్రభుత్వం లేఖ రాయటం, దాన్ని హైకోర్టు తప్పు పట్టటం, రిపబ్లిక్ వేడుకలను అధికారికంగా నిర్వహించాలని ఆదేశించటం తెలిసిందే.
గతంలో జనవరి 26 వస్తున్నదంటే.. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ మాత్రమే కాదు, ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారేది. వారం పది రోజుల ముందు నుంచీ ఏర్పాట్లు సాగేవి. నగర ప్రజానీకమే కాకుండా, వివిధ జిల్లాల గ్రామీణ, పట్టణ ప్రాంతాల నుంచి కూడా ప్రజలు గణతంత్ర వేడుకలను చూసేందుకు తరలి వచ్చేవారు.
రిపబ్లిక్ పరేడ్‌లో ఆర్మీ (పదాతి సేన), సీఆర్‌పీఎఫ్ లాంటి కేంద్ర బలగాలు, రాష్ట్ర ప్రభుత్వ శకటం, వివిధ ప్రభుత్వ శాఖల శకటాలు, అశ్విక దళం, ఫైర్ సేఫ్టీ ప్రదర్శనలతో పరేడ్ చూపరులను ఆకట్టుకొనేది. వివిధ ప్రభుత్వ శాఖల శకటాలు రాష్ట్రాభివృద్ధిని చాటేవి. బలగాలు గవర్నర్, ముఖ్యమంత్రులకు గౌరవ వందనం సమర్పించేవి. మొత్తం మీద స్వాతంత్య్ర, గణతంత్ర వేడుకలు అంటే.. దేశాభివృద్ధికీ, మన బలగాల శక్తిసామర్థ్యాలకు ప్రతీకగా నిలిచేవి. ఇప్పుడు అవన్నీ గతంగా మారిపోవటమే విషాదం.