Kannappa: మంచు విష్ణు ప్రధాన పాత్రలో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న కన్నప్ప సినిమా మరోసారి వార్తల్లో నిలిచింది. ఈసారి చిత్ర నిర్మాణ విశేషాలతో కాకుండా చిత్రానికి సంబంధించిన కీలక దృశ్యాలతో కూడిన హార్డ్ డ్రైవ్ మాయమైందన్న సమాచారంతో వార్తల్లోకి వచ్చింది. కన్నప్ప చిత్రం కీలక దృశ్యాలు ఉన్న హార్డ్ డ్రైవ్ పట్టుకొని ఆఫీస్ బాయ్ రఘు పారిపోయినట్లుగా ఎగ్జిక్యూటివ్ నిర్మాత విజయ్ కుమార్ రెడ్డి ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు 24 ఫ్రేమ్స్ సంస్థ ఉద్యోగులపై నమ్మక ద్రోహం కేసు నమోదు చేశారు. చరిత అనే యువతితో పాటు రఘుపై కేసు నమోదు చేశారు. రెబల్ స్టార్ కృష్ణం రాజు హిట్ సినిమా భక్త కన్నప్ప రీమేక్ గా ఆధునిక హంగులను జోడించి అవా ఎంటర్ టైన్ మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మిస్తున్న కన్నప్ప సినిమాను 100కోట్లకు పైగా బడ్జెట్ తో తీర్చిదిద్దుతున్నారు. ఈ సినిమాపై మంచు ఫ్యామిలీ భారీ ఆశలు పెట్టుకున్న సమయంలో చిత్ర నిర్మాణం విఎఫ్ఎక్స్ ఆలస్యం కారణంగా ఏప్రిల్ 25న విడుదల కావాల్సిన సినిమా జూన్ 27కు వాయిదా పడింది.
ఇప్పుడు కన్నప్ప చిత్రానికి సంబంధించిన కీలక దృశ్యాలు ఉన్న హార్డ్ డ్రైవ్ మాయం కావడంతో సినిమా యూనిట్ కు భారీ షాక్ తగిలినట్లయ్యింది. మంచు విష్ణు, ప్రితి ముకుందన్, మోహన్ బాబుతో పాటు ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, కాజల్ అగర్వాల్, ముఖేష్ రుషి వంటి పలు భాషల ప్రముఖ నటులు కన్నప్పలో నటిస్తున్నారు. దీంతో కన్నప్న క్రేజీ ప్రాజెక్టుగా పాన్ ఇండియా సినిమాగా మారిపోవడంతో ప్రేక్షకులు సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలో చిత్రానికి సంబంధించిన కీలక దృశ్యాల హార్డ్ డ్రైవ్ మాయమైన నేపథ్యంలో అందులోని దృశ్యాలు లీకయితే సినిమాకు నష్టం చేకూర్చవచ్చన్న ఆందోళన చిత్ర యూనిట్ లో నెలకొంది.