Karimnagar
- రెండేళ్లుగా హెచ్చరికలు పట్టించుకోక తెగిన చెరువు
విధాత బ్యూరో, కరీంనగర్: చిన్న బోనాల చెరువు తెగి సిరిసిల్ల పట్టణం వరద ముంపుకు కావడం
ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగింది కాదని, ఇది ముమ్మాటికి అధికారుల వైఫల్యమేనన్న విమర్శలు వినవస్తున్నాయి. చిన్న బోనాల చెరువుకు బుంగ పడిందని, చెరువు తెగిపోయే ప్రమాదం ఉందని తెలిసినా అధికారులు మీన మేషాలు లెక్కిస్తూ కూర్చున్నారన్న విమర్శలు జోరందుకున్నాయి.
చెరువుకు గండితో వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో సిరిసిల్ల పట్టణంలోని వెంకంపేట, సంజీవయ్య నగర్, శాంతినగర్, శ్రీనగర్ కాలనీ, పాత బస్ స్టేషన్, కరీంనగర్ రహదారి జలమయమై
ప్రజలు కట్టుబట్టలతో ఇళ్లు వదిలి పెట్టాల్సిన పరిస్థితి వచ్చిన విషయం తెలిసిందే.
వరుసగా గత నాలుగేళ్లుగా సిరిసిల్ల పట్టణం వరద నీటి సమస్యను ఎదుర్కొంటున్నా, దానిని పరిష్కరించడంలో పురపాలక శాఖ మంత్రి కే. తారక రామారావు వైఫల్యం చెందారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
సిరిసిల్లలో అధికార యంత్రాంగం వైఫల్యాలపై ఇప్పటికైనా మంత్రి కళ్ళు తెరిచి తనకు రాజకీయ జన్మనిచ్చిన సిరిసిల్లలో జరుగుతున్న అవినీతిపై దృష్టి సారించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. సమీకృత కలెక్టరేట్ నిర్మించిన మొదటి సంవత్సరమే వరద ముంపుకు గురైందని, వరద నీటి మళ్లింపు చర్యల కోసం కేటాయించిన కోట్ల రూపాయల నిధులు ఎక్కడికి వెళ్లాయంటు విపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు.
రెండేళ్ల నుండే..
చిన్న బోనాల చెరువుకు బుంగి పడిందని, ఎప్పుడైనా తెగిపోయే ప్రమాదం ఉందని ఆ ప్రాంతానికి ప్రతినిధ్యం వహిస్తున్న కౌన్సిలర్ నాగరాజు రెండేళ్ల నుండి అధికారుల దృష్టికి తీసుకువస్తున్నారు.
తాజాగా గత ఫిబ్రవరి 24న జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలోనూ ఆయన ఈ విషయాన్ని కౌన్సిల్ దృష్టికి తెచ్చారు.
అటు మున్సిపల్ కమీషనర్,ఇటు నీటిపారుదల శాఖ అధికారుల దృష్టికి తెచ్చారు.
అయినప్పటికీ వారి స్పందన లేకపోవడంతో బోనాల చెరువుకు గండిపడి సిరిసిల్ల పట్టణం జలమయమైంది.
సొంత పురపాలక సంఘం పరిస్థితులు చక్కదిద్దలేని మంత్రి కేటీఆర్ ఆ శాఖకు ఎంతమేరకు న్యాయం చేస్తారంటు స్థానికంగా విమర్శలు వినిపిస్తున్నాయి.