కింకర్తవ్యం..!
కాళేశ్వరం కమిషన్ కు ఏం చెబుదాం
మరోసారి కేసీఆర్, హరీష్ రావుల భేటీ !!
విధాత, హైదరాబాద్ : కాళేశ్వరం కమిషన్ ముందు హాజరు అంశంపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి టి.హరీష్ రావులు మరోసారి కీలక చర్చలు జరిపారు. శుక్రవారం ఎర్రవెల్లి ఫాంహౌస్‌లో సమావేశమైన కేసీఆర్, హరీష్‌రావు లు.. సుమారు మూడున్నర గంటలపాటు చర్చించారు. జూన్ 5న కేసీఆర్, 9న హరీష్‌రావు.. కమిషన్ ఎదుట వినిపించాల్సిన వివరణపై వారు కసరత్తు చేశారు. కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు జరిగిన విచారణపై కేసీఆర్ సమీక్షించారు. కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ నివేదికను ఎల్ ఆండ్ టీ తప్పుపట్టడంపైనా చర్చించారు. రాజకీయ కక్షతోనే కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు చేశారని కేసీఆర్ ఆరోపించారు. కాళేశ్వరం కమిషన్ నోటీసులతో పాటు, ఎమ్మెల్సీ కవిత అంశంపై కూడా కేసీఆర్, హరీష్ రావు చర్చించినట్లుగా సమాచారం. కాగా కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చినప్పటి నుంచి ఇప్పటికే కేసీఆర్, హరీశ్ రావులు నాలుగు సార్లు భేటీ అవ్వడం గమనార్హం.