విధాత, మెదక్ బ్యూరో: విద్యార్థుల విహారయాత్రలో విషాదం చోటు చేసుకుంది. కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లిన రాకేష్ అనే విద్యార్థి నీటి కాలువలో పడి మృతి చెందారు. ఈ విషాద సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
మెదక్ జిల్లా కల్చారం ఉన్నత పాఠశాల నుండి కర్ణాటకలోని బళ్ళారి తో పాటు ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు వారం రోజుల విహార యాత్రకు పీఈటీ శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు శంకర్, రాజేష్, ఏసుమని, రాజు, ప్రమీలతో పాటు పాఠశాల కు చెందిన 9,10 తరగతులకు చెందిన 54 మంది విద్యార్థులు బస్సులో విహార యాత్రకు వెళ్లారు.
కొల్చారం మండలం అప్పాజీపల్లి గ్రామానికి చెందిన విద్యార్థి పిచ్చకుంట్ల రాకేష్ (14) మంగళవారం ఉదయం కాల కృత్యాలు తీర్చుకొనేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు కర్ణాటకలోని బళ్లారిలో నీటి కాలువలో పడి మరణించారు. ఇదిలా ఉండగా స్నానానికి కాలువలోకి దిగి విద్యార్థి మరణించాడని ప్రచారం జరుగుతుంది.
విహారయాత్రకు విద్యాశాఖ అనుమతి లేదని తెలిసింది. కేవలం పాఠశాల మేనేజ్ మెంట్ కమిటీ సమావేశంలో చర్చించి విద్యార్థులను ఉపాధ్యాయులు విహారయాత్రకు తీసుకెళ్లారని ఉపాధ్యాయులు చెపుతున్నారు. ఒక్కో విద్యార్థి వద్ద 3,500 రూపాయలు తీసుకొని 7 గురు ఉపాధ్యాయులు 54 మంది విద్యార్థులను 7 రోజుల పాటు వివిధ పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్లారు.
కేవలం 3 నెలల్లో కొల్చారం మండలం కొంగొడు ప్రభుత్వ పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు గుంతలో పడి మృతి చెందారు. ఇదే మండలం రంగంపేట ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ట్రాక్టర్ డీ కొని మృతి చెందాడు. ఈ సంఘటనలు మరవక ముందే మరో విద్యార్థి రాకేష్ కొల్చారo ఉన్నత పాఠశాల 10 వతరగతి విద్యార్థి విహారయాత్రలో బళ్లారిలో మరణించారు.
దీంతో కొల్చారo మండలంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్ హరీష్ జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ ను ఆదేశించారు. ఉపాద్యాయుల తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు సర్వత్రా నిరసన వ్యక్తం చేస్తున్నారు.
సంఘటనపై డీఈఓ రమేష్‌ను వివరణ కోరగా కొల్చారం ఉన్నత పాఠశాల విద్యార్థుల విహార యాత్రకు పర్మిషన్ ఇవ్వలేదని, సంబంధిత ప్రధాన ఉపాధ్యాయునిపై, ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటామని డీఈఓ రమేష్ వివరణ ఇచ్చారు. ఇదిలాఉండగా ప్రధానోపాధ్యాయుడు నర్సింహులు విహార యాత్రకు వెళ్లకపోవడం గమనార్హం.