Infant | ఓ తల్లి తన మాతృత్వాన్ని మరిచింది. 21 రోజుల ఆడశిశువును రూ. 4 లక్షలకు మరో మహిళకు అమ్మేసింది. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. కోల్‌కతాలోని రైల్ కాలనీలో రూపాలి మండల్ నివాసం ఉంటుంది. రూపాలి 21 రోజుల క్రితం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆ పాపను మరో మహిళకు రూ. 4 లక్షలకు విక్రయించింది. పసిపాప కనిపించడం లేదంటూ రూపాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు విచారణలో భాగంగా రూపాలిని పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. పాప అదృశ్యంపై ఆమెను ప్రశ్నించగా, పొంతన లేని సమాధానాలు చెప్పింది. పోలీసులు తమదైన శైలిలో విచారించగా, చేసిన నేరాన్ని అంగీకరించింది. మరో మహిళకు రూ. 4 లక్షలకు తన బిడ్డను విక్రయించానని ఒప్పుకుంది.
దీంతో రూప దాస్, స్వప్న సర్దార్ అనే ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్టు చేశారు. మిడ్నాపూర్‌కు చెందిన కల్యాణి గుహ అనే మహిళకు పాపను విక్రయించినట్లు రూప పోలీసులకు తెలిపింది. పోలీసులు మిడ్నాపూర్ వెళ్లి కల్యాణిని అదుపులోకి తీసుకుని, పాపను శిశు విహార్‌కు తరలించారు. అయితే కల్యాణికి పెళ్లై 15 ఏండ్లు అవుతున్నప్పటికీ సంతానం కలగలేదు. దీంతో ఆమె తన మాతృత్వపు కోరికను తీర్చుకునేందుకు పసిపాపను కొనుక్కుంది.