న్యూఢిల్లీ : భారత్-అమెరికా మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఖరారైంది.ఈ మేరకు అమెరికా – భారత్ సంయుక్తంగా ఒప్పందాన్ని విడుదల చేశాయి. కేంద్రమంత్రి పీయూశ్ గోయల్ సోషల్ మీడియాలో ఈ మేరకు పోస్టు పెట్టారు. ఈ మధ్యంతర ఒప్పందాన్ని చరిత్రాత్మక విజయంగా అభివర్ణించారు. ఇది భారతీయ ఎగుమతిదారులకు 30ట్రిలియన్ డాలర్ల మార్కెట్ కు దారులు తెరుస్తుందన్నారు. ఎంఎస్‌ఎంఈలు, రైతులు, మత్స్యకారులకు ప్రయోజనం చేకూరుస్తుందని తెలిపారు.
ఎగుమతులు పెరగడంతో దేశవ్యాప్తంగా మహిళలు, యువతకు లక్షలాది కొత్త ఉద్యోగావకాశాలు వస్తాయని పేర్కొన్నారు. దుస్తులు, తోలు, పాదరక్షలు, ప్లాస్టిక్, రబ్బరు ఉత్పత్తులు, సేంద్రియ రసాయనాలు, గృహాలంకరణ, చేతివృత్తుల ఉత్పత్తులు, ఎంపిక చేసిన యంత్రాలు వంటి కీలక రంగాలకు లాభదాయకమని చెప్పారు. దేశీయ రైతుల ప్రయోజనాల పరిరక్షణకు మొక్కజొన్న, గోధుమ, బియ్యం, సోయా, సుగంధ ద్రవ్యాలు, ధాన్యాలు, నూనెగింజలు, పౌల్ట్రీ, పాలు, జున్ను, ఇథనాల్, పొగాకుతో పాటు కొన్నిరకాల కూరగాయలు, మాంసం వంటి వ్యవసాయ, పాల ఉత్పత్తులపై సుంకాల విషయంలో అమెరికాకు ఎలాంటి రాయితీలు ఇవ్వలేదని గోయల్ తెలిపారు.
భారత ఉత్పత్తులపై సుంకాన్ని 50శాతం నుంచి 18శాతానికి తగ్గించినట్లు భారత్-అమెరికా ట్రేడ్ డీల్ ఒప్పందం పేర్కొంది. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను నిలిపివేసేందుకు భారత్ అంగీకరించిందని అమెరికా తెలిపింది. 500 బిలియన్ డాలర్లు విలువైన దిగుమతులకు భారత్ అంగీకరించిందని పేర్కొంది. ఈ నిర్ణయం భారత ఎగుమతులకు గణనీయమైన ఊరటగా భావిస్తున్నారు. ఈ ఒప్పందం సుంకాల తగ్గింపు, ఇంధన భాగస్వామ్యాల పునర్వ్యవస్థీకరణ, ఆర్థిక సహకారాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా రూపొందించారు. దీని ద్వారా భవిష్యత్తులో కుదిరే విస్తృత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (BTA) వైపు చర్చలను వేగవంతం చేయాలని రెండు దేశాలు సంకల్పించినట్టు ఉమ్మడి ప్రకటనలో వెల్లడించాయి. అయితే, పూర్తి స్థాయి ఒప్పందాన్ని ఖరారు చేయడానికి ఇంకా అనేక దశల చర్చలు అవసరమని కూడా స్పష్టం చేశాయి.
ఇది గ్రేట్ న్యూస్ : ప్రధాని నరేంద్ర మోదీ
భారత్ – అమెరికా మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స వేదికగా స్పందించారు. ఇది ఇరు దేశాలకు గ్రేట్ న్యూస్ అని మోదీ వెల్లడించారు. ఒప్పందం సాకారం కోసం నిబద్ధతతో కృషి చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. భారత్-అమెరికా సంబంధాలను కొత్త దశకు తీసుకెళ్లుతుందని, ఇది ‘మేక్ ఇన్ ఇండియా’ లక్ష్యాన్ని మరింత బలోపేతం చేస్తుంది. దీనిద్వారా మహిళలు, యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని మోదీ ఆకాంక్షించారు.
ట్రేడ్ డీల్ పై కాంగ్రెస్ ఫైర్
భారత్-అమెరికా ట్రేడ్ డీల్ ప్రకటనపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. మాజీ కేంద్ర మంత్రి జై రాం రమేశ్ దీనిపై స్పందించారు. ‘హౌడీ మోదీ’ కంటే.. ‘నమస్తే ట్రంప్’ పైచేయి సాధించారంటూ జైఎద్దేవా చేశారు. స్నేహితుడు ఎన్నటికీ స్నేహితుడిగానే కొనసాగబోడంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ట్రేడ్ డీల్ పై భారత్- అమెరికా చేసిన సంయుక్త ప్రకటనలో వివరాలను సరిగ్గా ప్రస్తావించలేదు అని విమర్శించారు. కొన్ని వస్తువులపై అదనపు సుంకాలు ఎదుర్కోవాల్సి రావచ్చని పేర్కొన్నారు.
