విధాత: బర్రెలక్క ఈ పేరు తెలియని వారు ఎవరూ ఉండరు. ఎందుకంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పేరు అంత ప్రాచుర్యం పొందింది. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే కాదు.. పొరుగున ఉన్న ఏపీతో పాటు ఇతర రాష్ట్రాలు, ప్రపంచ వ్యాప్తంగా బర్రెలక్క పేరు మార్మోగింది. దళిత కుటుంబానికి చెందిన బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష.. కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ బరిలో దిగింది. నిరుద్యోగుల తరపున తాను నామినేషన్ వేసినట్లు ప్రకటించింది.
ఆ తర్వాత ఆమెకు ఊహించనంత ఆదరణ లభించింది. రాజకీయ మేధావులు, సామాజిక వేత్తలు, నిరుద్యోగులు బర్రెలక్కకు బాసటగా నిలిచారు. ఆమె తరపున ప్రచారం నిర్వహించారు. ఈల గుర్తుకు ఓటేయాలని విస్తృతంగా ప్రచారం చేశారు. ఆమెకు వచ్చిన ఆదరణను చూసి తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగుల పర్వం కొనసాగింది. ఆమెకు ఎన్ని ఓట్లు వస్తాయి..? అనే దానిపై బెట్టింగ్ జోరుగా సాగింది.
ఇక ఇవాళ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి.
బర్రెలక్కకు 5658 ఓట్లు పోలైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఈ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బీరం హర్ష వర్ధన్ రెడ్డి(బీఆర్ఎస్) ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ తరపున రంగంలోకి దిగిన జూపల్లి కృష్ణారావు 92590 ఓట్లు సాధించి భారీ విజయం నమోదు చేశారు. అయితే జూపల్లి కృష్ణారావుకు పడే ఓట్లను బర్రెలక్క చీల్చే అవకాశం ఉందని ఆ నియోజకవర్గ ఓటర్లు ఊహించారు. కానీ అధికార పార్టీపై ఆగ్రహంతో ఉన్న ఓటర్లు.. ఏకపక్షంగా కాంగ్రెస్‌కు ఓట్లు వేశారు. దీంతో బర్రెలక్క ప్రభావం పెద్దగా చూపలేదు