Site icon vidhaatha

Paper Leak | లీకేజీకి రాజకీయ రంగు.. BRS VS BJP ఢీ అంటే ఢీ

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: టెన్త్ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారం రాజకీయ రంగును సంతరించుకుంది. రాష్ట్రంలో టిఆర్ఎస్, బిజెపి మధ్య నెలకొంటున్న ఆధిపత్య పోరు క్లైమాక్స్‌కు చేరింది. పరస్పరం విమర్శలు ఆరోపణలతో రాజకీయ వేడిని రగిలించేందుకు ప్రయత్నిస్తున్నారు. పరస్పరం రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకునే ఎత్తుగడలు ప్రయోగిస్తున్నారు. ఇందులో అసలు సమస్య పక్కకు పోయి అధికార పార్టీలు రెండు ఢీ అంటే ఢీ అంటూ పోటీపడుతున్నారు. రాష్ట్రాన్ని రాజకీయ రణరంగంగా మార్చి వేశారు.

ప్రధాన సమస్యలు పక్కకు..

పరీక్షలు, ఉద్యోగాల భర్తీ ఇతరత్రా ప్రభుత్వ అక్రమాలు, ప్రజాసమస్యలు చర్చకు రాకుండా ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు వ్యక్తం అవుతుంది. ఇప్పటికే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంతో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అపనిందని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. దీనికి తోడు టెన్త్ ప్రశ్నపత్రాలు లీకేజీ ప్రభుత్వానికి పుండు మీద కారం చల్లిన‌ట్టుగా మారింది.

ఈ సమయంలో హిందీ పేపర్ లీకేజీ వ్యవహారం అధికార బీఆర్ఎస్ పార్టీకి అంది వచ్చిన అవకాశంగా మారగా, బిజెపిని దోషిగా నిరూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ రెండు వ్యవహారాలలో పారదర్శకంగా విచారణ జరిపితే ఎవరు నిందితులు? ఎవరు కారకులు? తేలిపోయే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

ప్రేక్షక పాత్రలో ఇతర పక్షాలు..

ఈ మొత్తం వ్యవహారంలో కేంద్రంలో అధికార పార్టీగా ఉన్న బిజెపి రాష్ట్రంలో అధికార పార్టీకి ఉన్న బీఆర్ఎస్ నాయకులు తప్ప తెరమీద మరో రాజకీయ పార్టీకి అవకాశం లేకుండా చేస్తున్నారని విమర్శిస్తున్నారు. ఈ విధంగా వారిని ప్రేక్షకులుగా చేసి అధికార పార్టీలు రాజకీయ చదరంగాన్ని కొనసాగిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రశాంత్ పాత్రతో కేసు మలుపు..

వికారాబాద్ తాండూరులో తెలుగు పేపర్ లీక్ కాగా కమలాపూర్ లో హిందీ పేపర్ లీక్ అయిన విషయం తెలిసిందే. పేపర్ లీకేజీలో నిందితుడిగా ఉన్న జర్నలిస్ట్ బూర ప్రశాంత్ తో బండి సంజయ్ కుమార్ సంబంధాల నేపథ్యంలో కేసు ఒక్కసారిగా రాజకీయ రంగు పులుముకుంది.

పకడ్బందీ పథక రచన

లీకేజీ కేసులో నిందితులను అరెస్టు చేసేంతవరకు చూసీచూడనట్లు వ్యవహరించిన ప్రభుత్వం. రాత్రికి రాత్రే రాజకీయ పథక రచన చేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పకడ్బందీగా రూపొందించిన పథకంలో భాగంగా అర్ధరాత్రి బండి సంజయ్ అరెస్టుతో పరిస్థితిని తమకు అనుకూలంగా ఉపయోగించుకునే ప్రయత్నం టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినట్లు చర్చ సాగుతోంది.

దానిని ఎదుర్కొనేందుకు బిజెపి సైతం తీవ్రంగా ప్రయత్నిస్తుంది. రాష్ట్రప్రభుత్వ ఎత్తులను తమకు అనుకూలంగా పై ఎత్తులతో ఆ పార్టీ పావులు కదుపుతోంది. ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయ వేడిని పెంచింది.

మరోవైపు ఇరు పార్టీలు సానుభూతి రాజకీయాలు చేస్తూ మైలేజీని పెంచుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. అటు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం, మంత్రులు, ఎమ్మెల్యేలు రంగంలోకి దిగి బిజెపిపై రాజకీయ దాడి పెంచారు. ఇటువైపు బీజేపీ కేంద్ర నాయకత్వంతో పాటు రాష్ట్ర నాయకత్వం అలర్ట్ అయి ఈ కేసు నుంచి ఎలా బయటపడాలి, ప్రత్యర్థి పార్టీని ఇరుకునపెట్టే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.

Exit mobile version