Site icon vidhaatha

Lok Sabha Elections | లోక్‌సభ రెండో విడత ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల.. నేటి నుంచి నామినేషన్‌ల స్వీకరణ

Lok Sabha Elections : లోక్‌సభ రెండో దశ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆ నోటిఫికేషన్‌లో పేర్కొన్న ప్రకారం.. రెండో విడత పోలింగ్‌ జరిగే లోక్‌సభ స్థానాల్లో నేటి నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. రెండో దశలో భాగంగా మొత్తం 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 88 లోక్‌సభ స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. వాటిలో ఔటర్‌ మణిపూర్‌ లోక్‌సభ స్థానం కూడా ఉన్నది. ఏప్రిల్ 26న రెండో దశ పోలింగ్ నిర్వహిస్తారు.


అసోం, బీహార్‌, చత్తీస్‌గఢ్‌, జమ్మూకశ్మీర్‌, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, త్రిపుర, ఉత్తరప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో రెండో విడత పోలింగ్‌ జరుగనుంది. ఇవాళ్టి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కాగా.. ఏప్రిల్‌ 4 వరకు గడువు ఉంది. జమ్ముకశ్మీర్‌ మినహా ఇతర రాష్ట్రాల్లో ఏప్రిల్‌ 5న నామినేషన్ల స్క్యూటినీ నిర్వహించనున్నారు. జమ్ముకశ్మీర్లో ఏప్రిల్ 6న స్క్రూటినీ ఉంటుంది.


రెండో విడత ఎన్నికల కోసం నామినేషన్‌లు దాఖలు చేసిన అభ్యర్థులు ఏప్రిల్‌ 8 లోపు తమ నామినేషన్‌లను ఉపసంహరించుకునేందుకు అవకాశం ఉంది. ఏప్రిల్‌ 26న పోలింగ్‌ జరుగనుంది. ఏడు విడతల్లో పోలైన ఓట్లను జూన్‌ 4న లెక్కిస్తారు. జాతుల వైరంతో అట్టుడుకుతున్న మణిపూర్‌లోని ఔటర్ మణిపూర్ లోక్‌సభ స్థానంలో రెండో దశలోనే పోలింగ్‌ జరగనుంది. ఇన్నర్‌ మణిపూర్‌ లోక్‌సభ స్థానంలో పోలింగ్‌ తొలి దశలో ఏప్రిల్‌ 19న జరగనుంది.


రెండో దశలోనే బెంగాల్‌లో పోలింగ్ జరగనుండటంతో అందరి దృష్టి బెంగాల్‌ రాజకీయాలపైనే ఉంది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బెంగాల్‌లో అధికార టీఎంసీ, బీజేపీ నేతల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఇక్కడ టీఎంసీ, బీజేపీ మధ్య టఫ్‌ ఫైట్‌ ఉండే అవకాశం ఉంది. కేరళలో త్రిముఖ పోటీ ఉండనుంది.

Exit mobile version