విధాత, హైదరాబాద్ : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని అన్నారు. గురువారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి, ఇతర ఎన్నికల సంఘం అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులు, అదనపు కలెక్టర్లు, పంచాయతీ అధికారులతో.. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల నిర్వహణ, ఓటరు జాబితా అభ్యంతరాలు, పోలింగ్ కేంద్రాలు, రిజర్వేషన్ల ప్రక్రియ, శాంతిభద్రతల అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్‌ఈసీ రాణి కుముదినీ మాట్లాడుతూ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల నిర్వహణ ప్రశాంత వాతావరణంలో సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికలను మూడు విడతలలో నిర్వహించేందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించాలని తెలిపారు. ఎన్నికల సమయంలో రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఎన్నికల ప్రవర్తన నియమావళి సమర్థవంతంగా అమలు చేయాలని, ఎన్నికల పరిశీలకులకు శిక్షణ అందించడం జరుగుతుందని తెలిపారు.
జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసే ఎన్నికల నిర్వహణ కమిటీ సభ్యుల జాబితా సమర్పించాలని రాణి కుముదిని సూచించారు. 2011 ఎన్నికల జాబితా ప్రకారం షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, 2024 ఎస్‌ఈ ఈఈపీసీ సర్వే ప్రకారం వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు కేటాయించనున్నట్లు తెలిపారు. ఈ
వీడియో కాన్ఫరెన్స్ లో ఆయా జిల్లా కలెక్టర్లు, జడ్పీసీఈలు, డిపిఓ లు, ఎన్నికల విభాగం అధికారులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
