రాంచీ: ఓ మై గాడ్.. ఆంజనేయస్వామిని రైల్వే అధికారులు హెచ్చరించడం ఏంటని అనుకుంటున్నారా? అవును ఇది నిజమే. ఎందుకంటే రైల్వే స్థలాల్లో హనుమంతుడి గుడిని నిర్మించారని, పది రోజుల్లో ఈ స్థలాన్ని ఖాళీ చేయాలని ఏకంగా ఆ ఆంజనేయస్వామికే రైల్వే అధికారులు నోటీసులు జారీ చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. జార్ఖండ్‌లోని ధన్‌బాద్ సిటీలో హనుమాన్ ఆలయాన్ని రైల్వే శాఖ స్థలంలో నిర్మించారని రైల్వే అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు నోటీసులు జారీ చేసి, ఆ ఆలయం వద్ద అతికించారు.
ఆ నోటీసులో ఏముందంటే.. హనుమాన్ జీ.. రైల్వే భూములను అక్రమంగా ఆక్రమించుకున్నావు. ఇది చట్టరీత్యా నేరం. పది రోజుల్లో ఈ స్థలాన్ని ఖాళీ చేయకపోతే.. మీపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించారు. దీన్ని కచ్చితంగా పరిగణనలోకి తీసుకొని, వీలైనంత త్వరగా స్థలాన్ని ఖాళీ చేయాలని నోటీసు చివరలో పేర్కొన్నారు.
ఇక ఆంజనేయస్వామితో పాటు స్థానికులకు కూడా రైల్వే అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆ ప్రాంతంలో సుమారు 60 నివాసాలు ఉన్నాయి. అవన్నీ కూడా రైల్వే స్థలాల్లోనే నిర్మించారని అధికారులు నోటీసులు జారీ చేశారు. రైల్వే నోటీసులపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొన్నేండ్ల నుంచి తాము ఇక్కడే ఉంటున్నామని స్పష్టం చేశారు. ఇక్కడ్నుంచి వెళ్లే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.