Site icon vidhaatha

Maha Shivratri 2024 | మహాశివరాత్రి పూజా సమయం ఎప్పుడో మీకు తెలుసా?

Maha Shivratri 2024 | హిందువులు అత్యంత నియమనిష్టలతో జరుపుకునే పండుగల్లో మహాశివరాత్రి అత్యంత ప్రాధాన్యమైంది. ఈ రోజే సృష్టి ఆవిర్భవించింది.. లింగోద్భవం జరిగింది. శివ పార్వతుల కల్యాణం జరిగింది. క్షీరసాగర మథనంలో అమృతంతో పాటు వచ్చిన గరళాన్ని మింగిన శివుడు దానిని తన శరీరంలో అదిమిపట్టేందుకు కంఠంలో దాచుకున్న రోజు ఇది. శివపార్వతుల ఆశీస్సులు పొందేందుకు ఈ రోజు చాలా ముఖ్యమైనది. ప్రతి నెలలో వచ్చే శివరాత్రిని మాస శివరాత్రి అని పిలుస్తారు. మాఘమాస చతుర్దశి నాడు వచ్చేది మహాశివరాత్రి అంటారు. ఈ సంవత్సరం మార్చి 8న మహాశివరాత్రి జరుపుకోనున్నారు.

పూజా వేళలు..

మాఘ బహుళ చతుర్దశి రోజు వచ్చే మహా శివరాత్రి అంటే మరింత ప్రత్యేకం. ఈ సంవత్సరం శివరాత్రి మార్చి 8 శుక్రవారం వచ్చింది. రాత్రి 8 గంటల 13 నిమిషాల వరకు త్రయోదశి తిథి ఉంటుంది. ఆ తర్వాత నుంచి చతుర్థశి ప్రారంభమవుతుంది. చతుర్దశి తిథి మార్చి 9, 2024 సాయంత్రం 06.17 గంటలకు పూర్తవుతుంది.

పూజా విధానం

మహాశివరాత్రి రోజు బ్రహ్మ ముహూర్తాన లేచి స్నానం చేయాలి. అనంతరం ఉపవాస దీక్ష స్వీకరించి శివలింగానికి పంచామృతంతో అభిషేకం చేయాలి. బిల్వపత్రాలను సమర్పించాలి. అభిషేకం తర్వాత ఓం నమః శివాయ మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఈ విధంగా రోజంతా శివారాధనలో ఉండాలి. రాత్రి అంతా జాగరణ చేసి.. మరునాడు భోజనం చేసి ఉపవాస దీక్షను విరమించాలి. ఈరోజున మహా మృత్యుంజయ మంత్రం పఠిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. ఈరోజు పేదలకు దానం చేస్తే మంచిది.

విదేశాల్లో వేడుకలు

మనదేశంతోపాటు ఇతర దేశాల్లోనూ ఈ పండుగను చాలా వైభవంగా జరుపుకొంటారు. నేపాల్ లోని పశుపతినాథ్ ఆలయంలో జరుపుకునే శివరాత్రి వేడుకలకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తారు. ఈరోజున భాగమతి నదిలో స్నానం చేసి శివుడి ఆరాధనలో తరిస్తారు. బంగ్లాదేశ్‌ లోనూ మహాశివరాత్రిని అత్యంత ఘనంగా జరుపుకొంటారు. మన తెలుగు రాష్ట్రాలు శివనామస్మరణలో మార్మోగుతాయి.

Exit mobile version