Maharashtra | విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే.. కీచకుడిగా మారాడు. విద్యార్థినులకు పాఠాలు బోధించడం మానేసి.. తరగతి గదిలో ఆ వీడియోలను విద్యార్థినులకు చూపిస్తూ, వేధింపులకు గురి చేస్తున్నాడు. బాధిత విద్యార్థినుల ఫిర్యాదుతో ఈ విషయం వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్ర కొల్హాపూర్ పరిధిలోని విద్యాలంకర్ శెల్వాడి స్కూల్‌లో వీపీ బంగ్డీ అనే వ్యక్తి ఇంగ్లీష్ టీచర్‌గా పని చేస్తున్నాడు. అయితే గత రెండేండ్ల నుంచి విద్యార్థినులకు తరగతి గదిలోనే అసభ్యకరమైన వీడియోలను చూపిస్తూ వేధింపులకు గురి చేస్తున్నాడు. పాఠాలు బోధించడం కూడా మానేసి, తాకరాని చోట తాకుతూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు.
ఉపాధ్యాయుడి వేధింపులు భరించలేని బాధిత అమ్మాయిలు.. స్కూల్ ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో టీచర్ బంగ్డీని సతారాలోని ఓ పాఠశాలకు బదిలీ చేశారు. విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని అమ్మాయిల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ ఘటనపై మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రి దీపక్ కేసర్కర్ స్పందించారు. విచారణ అనంతరం ఉపాధ్యాయుడు బంగ్డీపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.