Mahatma Gandhi | గాంధీ హత్య పాఠ్యాంశాల మార్పు వెనుక! చరిత్రపై కాషాయ కత్తి – 4

Mahatma Gandhi | ఆర్‌ఎస్‌ఎస్‌పై నిషేధం అంశం తొలగింపు గాడ్సే ఆర్‌ఎస్‌ఎస్‌ లింకులు మాయం సాధారణ యువకుడిగా చిత్రీకరించే యత్నం లౌకికవాదాన్ని భూతంగా చూపుతున్న సంఘ్‌ శక్తులు గాంధీని మళ్లీ చంపుతున్నట్టు ఫొటోలకు పోజులు ఆధునిక ప్రపంచానికి అహింసను పరిచయం చేసిన గాంధీ ఆ మహనీయుని చరిత్రను మళ్లీ మళ్లీ తెలుసుకోవాలి విధాత ప్రత్యేకం : మహాత్మా గాంధీ (Mahatma Gandhi) హత్య చుట్టూ ఉన్న నిజాలను చీకటి కోణాలను దాచిపెట్టాలనుకుంటున్నారు. అందుకే గాంధీ హత్య గురించిన […]

  • Publish Date - May 14, 2023 / 10:33 AM IST

Mahatma Gandhi |

  • ఆర్‌ఎస్‌ఎస్‌పై నిషేధం అంశం తొలగింపు
  • గాడ్సే ఆర్‌ఎస్‌ఎస్‌ లింకులు మాయం
  • సాధారణ యువకుడిగా చిత్రీకరించే యత్నం
  • లౌకికవాదాన్ని భూతంగా చూపుతున్న సంఘ్‌ శక్తులు
  • గాంధీని మళ్లీ చంపుతున్నట్టు ఫొటోలకు పోజులు
  • ఆధునిక ప్రపంచానికి అహింసను పరిచయం చేసిన గాంధీ
  • ఆ మహనీయుని చరిత్రను మళ్లీ మళ్లీ తెలుసుకోవాలి

విధాత ప్రత్యేకం : మహాత్మా గాంధీ (Mahatma Gandhi) హత్య చుట్టూ ఉన్న నిజాలను చీకటి కోణాలను దాచిపెట్టాలనుకుంటున్నారు. అందుకే గాంధీ హత్య గురించిన పాఠ్యాంశంలోని పేరాను మార్చి వేసినారు. హత్య చేసిన వ్యక్తి నాథూరామ్ గాడ్సే ఒక సాధారణ యువకుడిగా చిత్రించే ప్రయత్నం అక్కడ జరిగింది. ఆయన తీవ్రవాద భావాలున్న హిందూ చాందసవాద పత్రికకు ఎడిటర్ అనే విషయాన్ని మరుగున పెట్టారు. ఆయన పని చేసిన సంస్థ పేరు తీసేశారు. గాంధీజీ హత్య వల్ల ఆర్ఎస్ఎస్ పై కొంతకాలం నిషేధం విధించిన అంశాన్ని తొలగించారు.

గాంధీ విశ్వమానవుడైంది ఇలా..

ఈ సందర్భంగా మహాత్మా గాంధీ గొప్పతనాన్ని, ఆయన ఏవిధంగా విశ్వమానవుడైనాడనే విషయాన్ని విద్యార్థులకు తెలియజేయవలసిన అవసరం ఉన్నది. నేడు సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలంటే వాస్తవాలను విస్తృతంగా ప్రచారం చేయడమే ప్రత్యామ్నయం. గాంధీజీని హిందూ వ్యతిరేకిగా ముద్ర వేసే ప్రయత్నం జరుగుతుంది. నిజానికి ఆయన హిందూ మతాన్ని ఆచరిస్తూ పరమత సహనాన్ని పాటించిన మహానుభావుడు.

NCERT | దేశ చరిత్రపై కాషాయ కత్తి.. పాఠ్యాంశాల నుంచి కీలక అంశాల తొలగింపు

స్వాతంత్రోద్యమానికి అతడు నాయకత్వం వహించే నాటికి భారతదేశంలోని భౌగోళిక, సాంస్కృతిక భిన్నత్వం పట్ల స్పష్టమైన అవగాహనతో ముందడుగు వేశాడు. భారతదేశంలో ఉన్న వైవిధ్యభరితమైన వాతావరణాన్ని వైరుధ్యాల వైపు దారి తీయకుండా సంఘటితంగా ఉంచేందుకు సరియైన కార్యాచరణతో ముందుకు నడిచాడు. భారతదేశంలోని ఆనాటి పేదలకు ప్రతినిధిగా తన వేషధారణను మార్చుకున్నాడు. జీవితాంతం అదే ఆచరణను కొనసాగించారు.

మహాత్ముడిని ఇలా అర్థం చేసుకోవాలి

మహాత్మా గాంధీని అర్థం చేసుకోవాలంటే ఆయన బాల్యం, ఆయనపై ప్రభావం చూపించిన మత గ్రంథాలు, వ్యక్తుల గురించి తెలుసుకోవాలి. మహాత్మా గాంధీ గుజరాత్ లోని సముద్ర తీర గ్రామంలో జన్మించినారు. బాల్యంలో పెరిగిన వాతావరణం లో అత్యధికంగా హిందూ మత ప్రభావం కొంత జైన మత ప్రభావం ఉంది. తన 57 వ సంవత్సరంలో అద్వైతాన్ని స్వీకరించానని ప్రకటించినారు. ఆయన అద్వైతాన్ని స్వీకరించినప్పటికీ ద్వైతాన్ని వ్యతిరేకించలేదు.

హిందూ మతంతో పాటు ఇస్లాం, బౌద్ధం, క్రైస్తవాన్ని అధ్యయనం చేసినారు. ఆయనపై హిందూ, జైన, క్రైస్తవ మతాల ప్రభావం ఎక్కువగా ఉంది. టాల్ స్టాయి,శ్రీమద్ రామచంద్ర, రస్కిన్ లాంటి గొప్ప రచయితల ప్రభావం కూడా ఉంది. నమ్మిన నచ్చిన జీవన విధానంతో జీవించినప్పటికీ ఆహార వ్యవహారాదుల్లో ఎప్పుడూ రాజీపడలేదు. అయినప్పటికీ ఇతర మతాల ఆచారాలు ,సంస్కృతులను గౌరవించాడు.

హిందూ, ముస్లింలను ఏకతాటిపైకి తెచ్చిన నేత

మహాత్మా గాంధీ దృక్పథంలో స్వతంత్ర భారతదేశం బహుళ మతాల,బహుళ సంస్కృతుల సమ్మేళనం. పేదరికాన్ని నిర్మూలించడం, మహిళా హక్కులను పెంపొందించడం, విభిన్న మతాల మధ్య స్నేహ భావాన్ని పెంపొందించడం ద్వారా భారతజాతి ఐక్యతను కాపాడడం, అంటరానితనాన్ని రూపుమాపడం ద్వారా ఆధునిక భారతదేశాన్ని నిర్మించాలని కృషి చేశాడు. వీటి కోసం స్వాతంత్ర్యానికి పూర్వమే కృషి చేస్తూనే, భారతదేశానికి స్వాతంత్ర్య సాధన ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు.

NCERT | ప్రజల చరిత్రకు పాతర.. విద్యార్థులపై అవాస్తవాలు రుద్దే యత్నం | చరిత్రపై కాషాయం కత్తి- 2

స్వాతంత్రోద్యమంలో వేరువేరు సమూహాలుగా ఉన్న హిందూ ముస్లిం నాయకులను ఏకతాటిపైకి తీసుకొచ్చిన ఘనత మహాత్మా గాంధీది. విభజించి పాలించే బ్రిటిష్ రాజనీతికి ఈ వేర్వేరు పోరాటాలు ప్రజల మధ్య విభజనకు రేఖ తీసుకురావడానికి ఉపయోగపడ్డాయి. ఆయన ఖిలాఫత్ మూమెంట్ కు మద్దతు ప్రకటించక ముందు దేశ స్వాతంత్రం కోసం హిందూ ముస్లిం వర్గాలు వేర్వేరు సమూహాలుగా బ్రిటిష్ వారితో స్వాతంత్ర పోరాటం నిర్వహించారు.

ఖిలాఫత్‌ ఉద్యమానికి మద్దతు

1919 లో వచ్చిన ఖిలాఫత్ ఉద్యమాన్ని మహాత్మా గాంధీ బలపరిచినాడు. ఆ ఉద్యమానికి తన సంఘీభావాన్ని తెలిపినాడు. ఈ ఉద్యమం ఒక మతానికి సంబంధించినదని చూడకూడదని అభిప్రాయ పడ్డారు. టర్కీ దేశంలోని పౌరుల పట్ల చూపిస్తున్న వివక్షకు వ్యతిరేకంగా ఖిలాఫత్ ఉద్యమానికి మద్దతుగా సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నడిపినాడు. ఆయన తీసుకున్న నిర్ణయం వల్ల భారత స్వాతంత్రోద్యమంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా హిందూ, ముస్లిం వర్గాలు ఏకమై బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా కలిసి పోరాడినారు. కాంగ్రెస్-ఖిలాఫత్ కలిసిపోవడం ద్వారా భారతదేశంలో విశాల వేదికగా బలమైన రాజకీయ పార్టీ అవతరించింది. అక్కడి నుండి స్వరాజ్ మూమెంట్ తీవ్రమైన రూపం తీసుకున్నది.

ఈ విధంగా ఈ దేశంలోని ప్రజలందరి మధ్య భిన్నత్వంలో ఏకత్వాన్ని, స్వరాజ్య స్థాపన ఏకైక లక్ష్యం అనే నినాదాన్ని గాంధీజీ బలంగా తీసుకెళ్లారు. తన ఆచరణ ద్వారా ప్రజలకు నమ్మకం కలిగించారు. అందుకే స్వతంత్ర భారతదేశంలో తమఆస్తిత్వం,సంస్కృతి,భాషలకు గౌరవం దక్కుతుందని ప్రజలు నమ్మినారు. గాంధీజీ వెంట నడిచినారు. గాంధీజీ వాస్తవాలను గుర్తించాడు, స్వీకరించాడు. భారతదేశంలోని విభిన్న మతాలు,కులాలు,తెగల వారంతా కలిసిమెలిసి స్వతంత్ర భారతంలో జీవించడానికి అవసరమైన వాతావరణానికి పాదులు వేసాడు. స్వాతంత్రోద్యమ క్రమంలోని తన ఆచరణ ద్వారా సామరస్య జీవన సారాన్ని నిరూపించాడు.

తొలి విడతలో గాంధీని తలకెత్తుకున్న మోదీ సర్కార్‌

స్వాతంత్ర భారత వజ్రోత్సవాల సమయంలో మన దేశంలో పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడున్న ప్రభుత్వం మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు గాంధీజీ ఫోటోలు ముందు పెట్టుకుని స్వచ్ఛభారత్ పేరుతో ప్రజల్లోకి వచ్చింది. రెండోసారి అధికారంలోకి వచ్చాక గాంధీజీ సిద్ధాంతాలనే కాదు వ్యక్తిగా కూడా ఆయనను భరించలేని స్థితికి వచ్చింది. అధికార పార్టీ వారి అనుబంధ సంఘాలు నేటి భారత సమాజపు బహుళత్వాన్ని నిర్మూలించే పనిలో ఉన్నాయి. గాంధీజీ ఆశయాలను తుంగలో తొక్కి నియంతృత్వ హిందూ సమాజం ఏర్పాటు కోసం కృషి చేస్తున్నాయి.

భారతదేశ బహుళ సంస్కృతిని, విభిన్న మతాల,జాతుల,తెగల అస్తిత్వాలను గౌరవించ నిరాకరించిన సమూహం కొంతకాలము గాంధీ మాస్క్ వేసుకుని ప్రజలను తప్పుదోవ పట్టించారు. ఇప్పుడు తమ భావజాల ఆధిపత్యాన్ని మెజార్టీ ప్రజలపై బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. మహాత్మా గాంధీ దేశంలో ముస్లింలకు స్థానం కల్పించి తప్పు చేశారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సుమారు వెయ్యి సంవత్సరాలుగా ఈ దేశంలో ముస్లింలు జీవిస్తున్నారు.

సెక్యులరిజం ఒక ఆధునిక మానవ హక్కుగా ప్రపంచమంతా గుర్తిస్తున్న వేళ, భారతదేశాన్ని లౌకిక దేశంగా పరిగణించడం నేరమని విస్తృత ప్రచారం చేస్తున్నారు. భారత రాజ్యాంగం ముందుమాటలో పొందుపరిచిన సెక్యులరిజం(లౌకికత్వం) అనే పదాన్ని తీసేయాలని విస్తృత ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వాలపై, ప్రజలపై అన్ని మతాల ప్రాబల్యాన్ని సెక్యులరిజం నిరాకరిస్తుంది. సెక్యులరిజం ఒక ఉదాత్తమైన లక్షణం. ఆధునిక ప్రపంచంలో ప్రజలకు సార్వత్రికమైన మానవ హక్కులను కల్పిస్తుంది.

వివిధ దేశాలలో ఆయా మతాల యొక్క ఆధిపత్యాన్ని ప్రభుత్వాలపై రుద్దకుండా స్వతంత్రంగా ఉండాలని చెప్తుంది. అలాగే ప్రభుత్వం కూడా ప్రజలపై మతాన్ని రుద్దకూడదు. స్వతంత్రంగా జీవించే అవకాశం కల్పిస్తుంది. వ్యక్తులుగా ఎవరి మతాన్ని వారు పాటించి ఆచరించే వెసులుబాటు కనిపిస్తుంది. ఇప్పుడు సెక్యులరిజం అంటేనే ఒక పెద్ద భూతంగా చూపిస్తున్నారు. దానిపై అనాగరికంగా మాట్లాడుతున్నారు.

Darwin’s theory of evolution | పుస్తకాల్లో డార్విన్‌ పరిణామ సిద్ధాంతానికి చెల్లు.. మత విశ్వాసాలకు భిన్నంగా ఉండటం వల్లేనా? చరిత్రపై కాషాయం కత్తి – 3

అందుకే వారికి గాంధీజీ నచ్చడు. ఆయన విధానాలు నచ్చవు. నేటి విషాదం ఏమిటంటే గాంధీజీ హత్యను డెమాన్ స్ట్రేట్ చేస్తూ సెలబ్రేట్ చేసుకోవడం. ఆయన ఫోటో పెట్టి మళ్లీ కాల్చి చంపుతున్నట్టు హంతక ఆనందాన్ని పొందే వాతావరణం ఈదేశంలో ఏర్పడడం ప్రమాదకరం. దేశ ప్రజలచే జాతిపితగా కొనియాడబడిన గాంధీజీని మళ్లీ మళ్లీ హత్య చేస్తామంటూ ప్రదర్శన ఇస్తున్నారు. దేశంలో శాంతి దూతలకు స్థానం లేదని ప్రకటిస్తున్నారు. ఆధునిక ప్రపంచంలో ఇంతకంటే విషాదం ఇంకేముంటుంది.

అందుకే గాంధీజీ ఆశయాలను,ఆచరణను నేటి యువతకు తెలియజేయవలసి ఉన్నది. ఆధునిక ప్రపంచానికి అహింస అనే పదాన్ని పరిచయం చేసిన మహానుభావుడి గొప్పతనాన్ని మళ్లీ మళ్లీ మననం చేసుకోవాలి. ఎన్ సైక్లోపీడియా ఆఫ్ ఇండియా పుస్తకానికి ఎడిటర్ గా ఉన్న ప్రముఖ అమెరికన్ చరిత్రకారుడు స్టాన్లీ ఓల్పర్ట్ గాంధీజీని భారతదేశపు మహోన్నత విప్లవ జాతీయవాద నాయకుడిగా అభివర్ణించాడు. ఆయన కంటే గొప్ప జాతీయవాదులు ఈ దేశంలో లేరు.

భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం మనుగల సాగించాలంటే గాంధీజీ జీవితం, ఆచరణ నుండి విద్యార్థులు యువత అనేక విషయాలు అధ్యయనం చేయవలసి ఉన్నది. గాంధీ చెప్పినట్టు ” నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తిని పెంపొందించుకోవాలంటే అసహనం,అనాగరికత,దౌర్జన్యం, అనవసరమైన ఒత్తిడి ఉండకూడదు. ” ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, సమాన అవకాశాలు ప్రజలందరూ అనుభవించాలి.

– ఎర్రోజు శ్రీనివాస్

Latest News