- ఢిల్లీలో ఇ-రిక్షా డ్రైవర్ నుంచి డబ్బు
- దోచుకున్న యువకుడి అరెస్టు
విధాత: ఉత్తర ఢిల్లీలో ట్రాన్స్‌జెండర్‌గా నటిస్తూ ఇ-రిక్షా డ్రైవర్ నుంచి డబ్బులు దోచుకున్న 27 ఏండ్ల యువకుడిని సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. దీపక్ అలియాస్ శివానిని చాందనీ చౌక్ మెట్రో స్టేషన్ సమీపంలో కొత్వాలి పోలీస్ స్టేషన్‌కు చెందిన పెట్రోలింగ్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు.
“దీపక్ ట్రాన్స్‌జెండర్‌గా నటిస్తూ, ఇ-రిక్షా డ్రైవర్ నుంచి రూ. 810 లాక్కొని పారిపోతుండగా మా బృందం అతడిని పట్టుకున్నది” అని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (నార్త్) మనోజ్ కుమార్ మీనా తెలిపారు. విచారణలో దీపక్ తాను స్కూల్ డ్రాపౌట్ అని, మీరట్‌లో నివసిస్తున్నాని వెల్లడించినట్టు పేర్కొన్నారు. అతడు ఢిల్లీకి వచ్చినప్పుడల్లా యమునా బజార్ ప్రాంతంలో నివసించేవాడని వెల్లడించారు.
దీపక్ డ్రగ్స్ బానిసయ్యాడని, త్వరగా డబ్బు సంపాదించేందుకు రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతాల్లో స్నాచింగ్‌లు, దొంగతనాలకు పాల్పడేవాడని తెలిపారు. ట్రాన్స్‌జెండర్‌గా కనిపించేందుకు చీరలు కట్టుకుని అడుక్కునేవాడని పేర్కొన్నారు. ట్రాన్స్‌జెండర్‌గా ప్రజలను మోసగించడం తనకు బాగా పనికి వచ్చిందని దీపక్ వెల్లడించినట్లు పేర్కొన్నారు. దీపక్ గతంలో స్నాచింగ్, దొంగతనం, ఆయుధ చట్టం కింద ఏడు క్రిమినల్ కేసుల్లో ప్రమేయం ఉన్నట్టు పోలీస్ అధికారి వివరించారు.