Mancherial |
- రుణం రెట్టింపు అయ్యాక రుణ మాఫీయా ?
- నిరుద్యోగ భృతి హామీ విస్మరించిన కేసీఆర్
- మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు ధ్వజం
విధాత ప్రతినిధి ఉమ్మడి అదిలాబాద్: సీఎం కేసీఆర్‌కు అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ప్రజలు గుర్తుకు వస్తున్నారని, ఎన్నికలు సమీపిస్తున్నందునే సీఎం కేసీఆర్ వివిధ పథకాల పేరుతో ప్రజలను వంచిస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ, ఎఐసీసీ సభ్యులు కొక్కిరాల ప్రేమ్‌సాగర్ రావు విమర్శించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మొదట గద్దర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తున్నందున రైతు రుణమాఫీ చేపడుతున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారన్నారు. 2018 ఎన్నికల్లో రుణమాఫీ అని చెప్పి ఈ నాలుగేండ్ల లో మాఫీ చేయకుండా త్వరలో ఎన్నికలు ఉన్నందున రుణమాఫీ ప్రకటించారని ప్రభుత్వం చేసే రుణమాఫీ వడ్డీకే సరి పోతుందని, అసలు అప్పు రైతుల పేరిట బ్యాంకులో అలాగే ఉంటుందని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ హయంలో వైఎస్ఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత లక్ష రూపాయల రుణమాఫీని ఏకమొత్తంలో ఒకేసారి రద్దు చేయడం వల్ల రుణ విముక్తులై కొత్త పంటలు రుణాలు పొందేందుకు వెసులుబాటు కలిగిందని తెలిపారు. ప్రస్తుతం కేసీఆర్ చేసే రుణమాఫీ వల్ల రైతులకు పాత బాకీలు తీరకపోగా కొత్తగా బ్యాంకులు, వ్యవసాయ పరపతి సంఘాలు రుణాలు ఇవ్వడం లేదని, దీంతో రైతులు వడ్డీ వ్యాపారులపై ఆధారపడాల్సిన దుస్థితి నెలకొందని పేర్కొన్నారు.
డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి 9 సంవత్సరాలు గడిచినా హైద్రాబాద్ లో తప్ప ఎక్కడా ఎవరికి ఇవ్వలేదన్నారు. అనంతర సొంత ఇల్లు కట్టుకోవడానికి రూ. 5 లక్షలు ఇస్తానని చెప్పి తీరా ఇప్పుడు గృహలక్ష్మీ పేరుతో రూ. 3 లక్షలు ఇస్తామని చెప్పి నియోజకవర్గానికి 3 వేలు ఇండ్లు కేటాయించడం దారుణమన్నారు.
బీసీబంధు, దళితబంధు, మైనార్టీ బంధు, గృహలక్ష్మీ పథకాల లబ్దిదారులను ఎంపిక చేసే బాధ్యత ఎమ్మెల్యేలకు అప్పగించడం వల్ల పథకాలను వారి అనుచరులకే ఇస్తున్నారని, నిజమైన అర్హులకు మొండి చేయి చూపిస్తున్నారన్నారు. దళితబంధులో జిల్లాలో ఎమ్మెల్యేలు 30 శాతం వరకు కమీషన్ తీసుకుంటున్నారని సీఎం కేసీఆర్ చెప్పడం ఇందుకు నిదర్శనమన్నారు.
గత ఎన్నికల్లో నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించి ఇచ్చిన హామీని తుంగలో తొక్కారని పేర్కొన్నారు. వైన్స్ షాపుల టెండర్లకు గడువు పదిహేను రోజులు ఇచ్చి, గృహలక్ష్మీ పథకానికి కేవలం మూడు రోజులు గడువు ఇవ్వడం ద్వారా ప్రభుత్వానికి ప్రజా సంక్షేమం కన్నా పైసలపైనే దృష్టి ఉందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల చెన్నూరు, మంచిర్యాల, ఖానాపూర్ నియోజకవర్గాల్లో వర్షాకాలంలో వేల ఎకరాల పంట భూములు ఇండ్లు నీట మునిగి ప్రజలు నష్టపోతున్నారని దీనికి శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం ఆలోచించడం లేదన్నారు.
స్థానిక ఎమ్మెల్యే దివాకర్రావు నీరు వచ్చే చోట ఇండ్లు కట్టుకుంటే ముంపుకు గురికావా అని అనడం అవగాహన రాహిత్యానికి నిదర్శనమన్నారు. మంచిర్యాలలో ప్రజలు ఇండ్లు కట్టుకునే సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు లేదని, ఇటీవల ప్రాజెక్టు నిర్మించడం వల్ల ఇండ్లు నీట మునుగుతున్నాయన్నారు. ముంపులో మునుగుతుందని తెలిసి అదే ప్రాంతంలో ఎమ్మెల్యే ఎందుకు ఇల్లు కట్టుకున్నాడని ప్రశ్నించారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.