విధాత, సినిమా: మెగాస్టార్ చిరంజీవిని ప్రజలు సీరియస్‌గా, విభిన్న పాత్రలో చూడాలని కోరుకోవడం లేదని అర్థమైంది. ఆచార్య, గాడ్ ఫాదర్, సైరా నరసింహారెడ్డి వంటి చిత్రాల తర్వాత దీనిపై ఓ క్లారిటీ వచ్చింది. ఆయన నుంచి ఇప్పటికీ ఫక్తు మాస్ మసాలా ఎంటర్‌టైనర్లను మాత్రమే ప్రేక్షకులు ఆశిస్తున్నారని వాల్తేరు వీరయ్య ఘన విజయం నిరూపించింది.
ఇదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి కూడా మాస్ ఎంటర్‌టైనర్లను పండించగలిగిన దర్శకులకు పెద్దపీట వేస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్‌లోనూ ఇలాంటి చిత్రాలు తీయగలిగిన యంగ్ డైరెక్టర్లు బాగానే ఉన్నారు. బాబీ, అనీల్ రావిపూడి, వెంకీ కుడుముల, త్రినాథరావు నక్కిన వంటి పలువురు ఈమధ్య బాగా వెలుగులోకి వస్తున్నారు. ఇంకా చాలా మంది యంగ్ డైరెక్టర్లకు కూడా ఇలాంటి చిత్రాలను తీయగలిగిన సత్తా ఉంది.
ఇక విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి చలో భీష్మ వంటి ఎంటర్టైనను తీసిన వెంకీ కుడుములకు ఓ సినిమా చేస్తానని హామీ ఇచ్చాడు. ఇక తాజాగా ధమాకా చిత్రంతో మరోసారి ఎంటర్టైన్మెంట్‌ను పండించగలనని నిరూపించుకున్న త్రినాధరావు నక్కినకు మెగాస్టార్ ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం.
త్రినాధరావు నక్కిన గతంలో కూడా సినిమా చూపిస్త మామ, హలో గురు ప్రేమకోసమే వంటి పలు ఎంటర్టైన్మెంట్ చిత్రాలను తీశారు. ఈ చిత్రాలు బాగానే ఆడినా ఎందుకనో ఆయనకు అంతగా పేరు రాలేదు. కానీ రవితేజతో చేసిన ధమాకా చిత్రం ఆ లోటును భర్తీ చేసింది. సోలో హీరోగా రవితేజను 100 కోట్ల క్లబ్బులో చేర్చిన చిత్రంగా నిలిచింది.
ఈ ఘనతకు ప్రధాన కారణమైన డైరెక్టర్ త్రినాథరావుకు మెగాస్టార్ చిరంజీవి అవకాశం ఇస్తే ఆ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మించాలని చూస్తున్నాడు. ఆల్రెడీ చిరంజీవి త్రినాథరావు నక్కినకు మంచి స్క్రిప్ట్ ఉంటే చూసుకోమని కూడా చిరు చెప్పారట.
చిరంజీవి ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో బోళా శంకర్ చిత్రం చేస్తున్నాడు. ఇది తమిళ వేదాళం చిత్రానికి రీమేక్. ఈ చిత్రం తర్వాత వెంకీ కుడుమల లేదా త్రినాథ్ రావు నక్కినలతో మెగాస్టార్ చిరంజీవి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరిద్దరిలో ఎవరు ముందుగా తమ స్క్రిప్ట్ తో చిరుని మెప్పిస్తే వారితో ముందుగా చిరు సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ముందుగా ఏ సినిమా ప్రారంభమైతే ఆ చిత్రానికి డివివి దానయ్య నిర్మాతగా ఉంటుందని సమాచారం.
గతంలో త్రినాథరావు నక్కిన అల్లు అర్జున్ హీరోగా ఓ చిత్రం చేయాలని భావించాడు. మెగాస్టార్‌తో గనక హిట్టు కొడితే మిగిలిన స్టార్ హీరోలంతా ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా డేట్స్ ఇచ్చే అవకాశం ఉంది. అవకాశం గనక ఓకే అయితే ఈ దర్శకుడి దశ ఇక తిరిగినట్టేనని అందరూ భావిస్తున్నారు.