మాస్కులు ధ‌రించండి.. అప్ర‌మ‌త్తంగా ఉండండి : దామోద‌ర రాజ‌న‌ర్సింహ‌

ఆసియా దేశాల్లో వేగంగా వ్యాప్తి చెందుతున్న జేఎన్1 వేరియంట్ కేసు కేరళలో ఇటీవల గుర్తించారు. కేర‌ళ‌లో న‌లుగురు, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఒక‌రు చ‌నిపోయారు

  • Publish Date - December 19, 2023 / 05:59 AM IST

హైద‌రాబాద్ : ఆసియా దేశాల్లో వేగంగా వ్యాప్తి చెందుతున్న జేఎన్1 వేరియంట్ కేసు కేరళలో ఇటీవల గుర్తించారు. కేర‌ళ‌లో న‌లుగురు, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఒక‌రు చ‌నిపోయారు. మ‌రోవైపు యాక్టివ్ కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం.. సోమ‌వారం రాష్ట్రాల‌ను అప్ర‌మ‌త్తం చేసింది.

క‌రోనా స‌బ్‌వేరియంట్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాల‌ని ఆదేశించింది. దీంతో తెలంగాణ ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మైంది. వైద్య శాఖ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోద‌ర రాజ‌న‌ర్సింహ ఆదేశించారు. కేర‌ళ వెళ్లే అయ్య‌ప్ప భ‌క్తులు కూడా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌న్నారు.


రాబోయే రోజులు పండుగల సీజన్‌ కావడంతో ప్రజలు పరిశుభ్రతను పాటించాలని, అవసరమైన మేరకు మాస్కులను ధరించాలని సూచించారు. వృద్ధులు, శ్వాసకోస సంబంధిత సమస్య ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు. అవసరమైన ప్రజారోగ్య చర్యలు, ఇతర ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను మంత్రి ఆదేశించారు.

కొవిడ్-19ను ఎదుర్కొనేందుకు తెలంగాణ యంత్రాంగం పూర్తిగా సిద్ధంగా ఉందని దామోద‌ర రాజ‌న‌ర్సింహ స్ప‌ష్టం చేశారు. కేంద్రం సూచనలతో రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందవద్దని, చలికాలంలో శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, సమస్యలు తలెత్త‌డం సాధార‌ణ‌మ‌న్నారు. అయితే కరోనా వ్యాప్తి చెందుతున్నందున పరిశుభ్రత పాటిస్తూ, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రజలకు మంత్రి సూచించారు.

Latest News