- మహిళా సంక్షేమ పథకాలలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్
- సామూహిక సీమంతాలలో మంత్రి జి.జగదీశ్‌రెడ్డి
Minister Jagadish Reddy | విధాత: మహిళా ఆరోగ్యం, సాధికారతకు సీఎం కేసీఅర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని సూర్యాపేట శాసన సభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి (Minister Jagadish Reddy) పేర్కొన్నారు. సూర్యాపేటలోని బాలాజీ ఫంక్షన్ హాల్లో వాసవి – వనిత క్లబ్ ఆధ్వర్యంలో సామూహిక సీమంతాల కార్యక్రమానికి హాజరైన మంత్రి 104 మంది గర్బిణీలకు చీరలు, పండ్లు, పూలు పంపిణీ చేసి ఆశీర్వదించారు.
అనంతరం మాట్లాడుతూ.. కులమత భేదాలు లేకుండా ఇంతమంది పేద మహిళలకు వనిత- వాసవి క్లబ్ ఆధ్వర్యంలో సామూహిక సీమంతాలు (Baby Shower) నిర్వహించడం అభినందనీయమన్నారు.బీఆర్‌ఎస్ ప్రభుత్వం మహిళా సాధికారత లక్ష్యంగా పలు పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. మహిళల అభివృద్ధి, సంక్షేమం లక్ష్యంగా పథకాల అమలులో రాష్ట్రం చాలా ముందుందన్నారు.
మహిళల హక్కులు, గౌరవాన్ని కాపాడుతూ సీఎం కేసీఆర్ కిట్ (CM KCR Kit) తో ఆడబిడ్డలకు పౌష్టికాహారం అందిస్తూ కుటుంబ వైద్యులుగా, కళ్యాణలక్ష్మి కింద ఆడపిల్లల పెళ్లి ఖర్చులు చూసుకుంటూ కుటుంబ పెద్దగా నిలిచారన్నారు. గత తొమ్మిదేళ్లలో 13,90,636 మంది బాలింతలు కేసీఆర్ కిట్ ద్వారా లబ్ధి పొందగా, 6.84 లక్షల మంది గర్భిణులకు కేసీఆర్ పౌష్టికాహార కిట్‌లు అందించారన్నారు. అమ్మ ఒడి పథకం ద్వారా 18,46,635 మంది మహిళలకు లబ్ధి చేకూరిందన్నారు.
తెలంగాణ రాష్ట్రం బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో మహిళా సంక్షేమంలో సరికొత్త రికార్డు సృష్టించిందన్నారు. కేసీఆర్ పాలనలో మహిళలు సుఖసంతోషాలతో జీవిస్తునారన్నారు. ఆడబిడ్డలకు సురక్షితమైన వాతావరణం కల్పించాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి మర్యాదపూర్వకంగా మిషన్ భగీరథను, షీటీమ్ లను ప్రారంభించారని, నీటి కుండ కోసం చాలా దూరం పాదయాత్రలు చేసే మహిళలకు పెద్ద ఊరటనిచ్చిందన్నారు.
ఇక ఆడబిడ్డల కోసం ఇటీవల తెచ్చిన ఆరోగ్య మహిళ పథకం వారీ పట్ల సీఎం కేసీఅర్ కు ఉన్న ప్రేమ, అభిమానాలకు నిదర్శనమన్నారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్ ఛైర్మన్ ఉప్పల లలితా ఆనంద్, ఉప్పల ఆనంద్, గుండా శ్రీదేవి, రాచకొండ శ్రీనివాస్, చల్లా లక్ష్మీకాంత్, రాచర్ల కమలాకర్, తోట శ్యామ్, లక్ష్మీ, వెంపటి సురేష్, తదితరులు పాల్గొన్నారు.