Telangana | కొప్పుల పిటిషన్ కొట్టివేత

Telangana ఇంత జరిగాక తుదివాదనలు వినాల్సిందే తేల్చి చెప్పిన హైకోర్టు ధర్మాసనం నెలాఖరులోగా తేల్చాలన్న సుప్రీంకోర్టు కేసుల మంత్రులకు కోర్టుల షాకులు విధాత: మంత్రి కొప్పుల ఈశ్వర్ తన ఎమ్మెల్యే పదవిపై దాఖలైన అనర్హత పిటిషన్‌ను కొట్టివేయాలంటూ వేసిన మధ్యంతర పిటిషన్‌ను మంగళవారం హైకోర్టు కొట్టివేసి మంత్రికి షాక్ ఇచ్చింది. మూడేళ్ల పాటు విచారణ జరిగాక, అడ్వకేట్ కమిషన్ ముందు వాదనలు విన్నాక, ఈ దశలో కేసును కొట్టివేయలేమని, తుది వాదనలు వినాల్సిందేనని కోర్టు తేల్చి చెప్పింది. […]

  • Publish Date - July 31, 2023 / 11:47 PM IST

Telangana

  • ఇంత జరిగాక తుదివాదనలు వినాల్సిందే
  • తేల్చి చెప్పిన హైకోర్టు ధర్మాసనం
  • నెలాఖరులోగా తేల్చాలన్న సుప్రీంకోర్టు
  • కేసుల మంత్రులకు కోర్టుల షాకులు

విధాత: మంత్రి కొప్పుల ఈశ్వర్ తన ఎమ్మెల్యే పదవిపై దాఖలైన అనర్హత పిటిషన్‌ను కొట్టివేయాలంటూ వేసిన మధ్యంతర పిటిషన్‌ను మంగళవారం హైకోర్టు కొట్టివేసి మంత్రికి షాక్ ఇచ్చింది. మూడేళ్ల పాటు విచారణ జరిగాక, అడ్వకేట్ కమిషన్ ముందు వాదనలు విన్నాక, ఈ దశలో కేసును కొట్టివేయలేమని, తుది వాదనలు వినాల్సిందేనని కోర్టు తేల్చి చెప్పింది. దీంతో కొప్పులకు తన అనర్హత కేసులో కోర్టు ఎలాంటి తీర్పునిస్తుందోనన్న టెన్షన్ పట్టుకుంది.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో 441 ఓట్ల మెజార్టీతో కొప్పుల ధర్మపురి అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరు లక్ష్మణ్ కుమార్‌పై గెలుపొందారు. ఓట్ల లెక్కింపులో ఈశ్వర్ అక్రమాలకు పాల్పడ్డారని, వీవీ ప్యాట్‌ల ద్వారా ఓట్ల లెక్కింపు పూర్తి చేయకముందే అధికారులు ఈశ్వర్ గెలిచినట్లుగా ప్రకటించారని ఆరోపిస్తూ లక్ష్మణ్ కోర్టును ఆశ్రయించారు. కేసు విచారణలో భాగంగా హైకోర్టు కౌంటింగ్ డాక్యుమెంట్లను, సీసీ టీవి ఫుటేజీలను సమర్పించాలని ఆదేశించింది.

స్ట్రాంగ్ రూమ్ తాళంచెవులు లేవంటూ జగిత్యాల కలెక్టర్ పేర్కొనగా, తాళాలు పగులగొట్టి పత్రాలను సమర్పించాలని కోర్టు ఆదేశించింది. ఇంతలోగా మంత్రి కొప్పుల తనపై దాఖలైన పిటిషన్ కొట్టివేయాలని హైకోర్టులో అప్పీల్‌ చేయగా, గత జూన్ 28న దానిని కోర్టు కొట్టివేసింది. అనంతరం కొప్పుల సుప్రీంకోర్టుకు వెళ్లగా అక్కడా ఎదురుదెబ్బ తగలగా, మళ్లీ హైకోర్టులో మధ్యంతర పిటిషన్ వేశారు. ఇప్పుడు దానిని కూడా కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో తుది వాదనలు వినాల్సిందేనని స్పష్టం చేస్తూ విచారణను బుధవారానికి వేసింది.

శ్రీనివాస్‌గౌడ్‌లోనూ టెన్షన్‌

ఇదే రీతిలో ఇటీవల మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సైతం తనపై దాఖలైన అనర్హత పిటిషన్‌ను కొట్టివేయాలన్న అభ్యర్థనను హైకోర్టు, సుప్రీంకోర్టు కొట్టివేశాయి. సోమవారం నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు శ్రీనివాస్‌గౌడ్ కేసు విచారణలో ఆయనపై ఏకంగా ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయాలని ఆదేశించడం విదితమే. అటు మంత్రి గంగుల కమలాకర్‌పై కూడా అనర్హత కేసు విచారణ కొనసాగుతున్నది.

గుబులు రేపుతున్న సుప్రీం ఆదేశాలు

ప్రజాప్రతినిధుల అనర్హత కేసులన్నింటినీ ఈ నెలాఖారులోగా తేల్చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో మంత్రుల కొప్పుల ఈశ్వర్‌, శ్రీనివాస్‌గౌడ్‌, గంగుల కేసులతో పాటు అనర్హత కేసులు ఎదుర్కొంటున్న 28మంది ఎమ్మెల్యేలు కోర్టు తీర్పులు ఏ విధంగా వస్తాయోనన్న ఆందోళనకు గురవుతున్నారు. తాజాగా కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్‌రావుపై అనర్హత వేటు పడగా, ఆయన స్థానంలో జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా కోర్టు ప్రకటించింది.

అనర్హత కేసుల్లో తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్‌, కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌, దేవరకొండ ఎమ్మెల్యే ఆర్‌ రవీంద్రకుమార్‌, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌లతో పాటు జనగామ, పరిగి, కరీంనగర్‌, హుస్నాబాద్‌, మంచిర్యాల, గద్వాల్‌, మహబూబ్‌నగర్‌, నాగర్ కర్నూల్‌, కొడంగల్‌, ఆసిఫాబాద్‌, పరిగి, గజ్వేల్‌, సికింద్రాబాద్‌, ఖైరతాబాద్‌, ఇబ్రహీంపట్నం, మల్కాజిగిరి, వరంగల్ ఈస్ట్‌, నాంపల్లి, జూబ్లీహిల్స్‌, గోషామహల్‌, పటాన్ చెరువు, వికారాబాద్‌, నాంపల్లి ఎమ్మెల్యేల పిటిషన్లు కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నట్లుగా తెలుస్తున్నది.