Site icon vidhaatha

Minister Malla Reddy | మల్లారెడ్డికి మళ్లీ నిరసన సెగ

Minister Malla Reddy |

విధాత, హైద్రాబాద్ : మంత్రి మల్లారెడ్డికి మరోసారి ప్రజల నుండి నిరసన ఎదురైంది. శామీర్‌పేట మండలం బొమ్మరాసి పేట గ్రామ పంచాయతీ పరిధిలో గ్రామస్తులకు ఇళ్ల పట్టాల పంపిణీ చేసే కార్యక్రమానికి మంత్రి మల్లారెడ్డి గ్రామానికి వెళ్లారు.

ఈ సందర్భంగా జరిగిన సభలో మల్లారెడ్డి మాట్లాడుతుండగా ఇప్పుడు కొంతమందికి పట్టాలిచ్చి వెళ్లిపోతే మిగతా వారికి ఎప్పుడిస్తారో నమ్మకం లేదంటూ గ్రామస్తులు గొడవకు దిగారు. గ్రామంలోని 380మంది అర్హులైన వారందరికి ఒకే సారి పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైతే తను కొంతమందికే పట్టాలిస్తానని మంత్రి చెప్పడంతో ఆగ్రహించిన గ్రామస్తులు మంత్రి గో బ్యాక్, డౌన్ డౌన్ అంటూ నినాదాలతో హోరెత్తించారు.

ఇదే సమయంలో గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా అక్కడకు చేరుకోవడం పరిస్థితి రసాభాసగా మారింది. గతంలో 2009లో కాంగ్రెస్ హాయంలో ఈ గ్రామంలో 200మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చామని, వాటినే తిరిగి పేర్లు మార్చి తమకు అనుకూలమైన వారికి ఇచ్చుకుంటున్నారని కాంగ్రెస్ నేత సింగిరెడ్డి హరివర్ధన్‌రెడ్డి ఆరోపించారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకుని వారిని అదుపులోకి తీసుకుని తమ వాహనాల్లో తరలిస్తుండగా గ్రామస్తులు అడ్డుకుని మంత్రి డౌన్‌డౌన్ అంటూ నిరసనకు దిగారు. చివరకు దిగొచ్చిన మల్లారెడ్డి గ్రామస్తులు కోరినట్లుగా 380మందికి వచ్చే మంగళవారం ఒకేసారి పట్టాలిస్తానని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు నిరసన విరమించారు.

Exit mobile version