Site icon vidhaatha

Surypeta: మిషన్ భగీరథ పై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు: మంత్రి జగదీష్ రెడ్డి

విధాత: రానున్న వేసవికాలం దృష్ట్యా సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా పట్టణ ప్రాంతాలు, గ్రామాల్లో నీటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని మిషన్ భగీరథ అధికారులను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి ఆదేశించారు. వేసవి నేపథ్యంలో మిషన్ భగీరథ తాగునీటి సరఫ‌రాపై సూర్యాపేట కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో మిషన్ భగీరథ అధికారులు (ఇంట్ర మరియు గ్రిడ్), మున్సిపల్ అధికారులు, పంచాయితీ రాజ్, ఇంజనీరింగ్, ఎంపీడీఓ లతో మంత్రి సమీక్షా నిర్వహించారు.

జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, ఆర్డీవోలు హాజరైన ఈ సమీక్ష సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రానున్న వేసవిలో సూర్యాపేట జిల్లా లో ఎక్కడ తాగు నీటి సమస్యలు తలెత్తకుండా తీసుకోవలసిన చ‌ర్య‌ల‌పై అధికారులతో చర్చించారు. జిల్లా వ్యాప్తంగా ప్రతీ ఇంట తప్పనిసరిగా నల్లా కలెక్షన్ అందజేసి నీటిని సరఫరా చేయాలని ఆదేశించారు. గ్రామాలలో అక్కడక్కడా జరగవలసిన ఇంట్రా పైప్ లైన్ పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మిషన్ భగీరథ నీటి సరఫరా విధానాన్ని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, మున్సిపాలిటీ లో తాగునీరు సరఫరాకు నిర్దిష్టమైన సమయం కేటాయించాలని సూచించారు.

పట్టణంలో మరియు గ్రామాల్లో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు. ఎక్కడైనా సమస్య ఉంటే వెంటనే మున్సిపల్ అధికారులు, మిషన్ భగీరథ అధికారులు స్పందించి నీటి సరఫరాను పునరుద్దరించి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మిషన్ భగీరథ తాగు నీటి సరఫరాలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని స్పష్టం చేశారు .వేసవి కాలం దృష్ట్యా నీటి సరఫరా పై సాకులు చెప్పొద్దన్నారు. నీళ్ళు రాని చోట కారణాలు వెతికి అధిగమించాలని కోరారు.

జిల్లా లోని 475 గ్రామాలలో మిషన్ భగీరథ ఇంట్రాకు సంబంధించి 214, గ్రిడ్ కు సంబంధించిన 178 సమస్యలు గుర్తించి 125 సమస్యలను పరిష్కారించామని అధికారులు మంత్రికి తెలిపారు. నెల రోజుల లోపు అన్ని అపరిష్కృత సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి జగదీష్ రెడ్డి ఆదేశించారు. ఐదు గంటలపాటు సాగిన ఈ సమీక్షా సమావేశంలో మండలాల వారీగా నీటి సరఫరా లోపాలు సమస్యల పై అధికారులను అడిగి తెలుసుకున్నారు. రహదారుల నిర్మాణం సమయంలో పంచాయితీ రాజ్, ఆర్ అండ్ బీ, నేషనల్ హైవేస్ అధికారుల తో కలిసి మిషన్ భగీరథ అధికారులు జాయింట్ సర్వే చేసిన తరువాతే పనులు మొదలు పెట్టాలని సూచించారు.

అనంతగిరి మండలం కొత్తగూడెం గ్రామంలో రోడ్ నిర్మాణ సమయంలో పైప్ లైన్ డ్యామేజ్ కారణంగా నీటి సఫరా లేక పోవడం పై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల్లోకి వెళ్ళి నీటి సరఫరా చేయక పోవడానికి గల కారణాల పై నివేదిక అందించాలని ఆదేశించారు. సమావేశం లో అదనపు కలెక్టర్ లు పాటిల్ హేమంత్ కేశవ్ , మోహన్ రావ్, మిషన్ భగీరథ సి.ఈ సురేష్, ఎస్.ఈ చెన్నారెడ్డి, ఆర్డీవో లు రాజేంద్ర కుమార్, కిషోర్ కుమార్, వెంకా రెడ్డి, జడ్పిట్ సీఈవో సురేష్, డి.పై. వో యాదయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Exit mobile version