Site icon vidhaatha

MLA Umang | హనుమంతుడు ఆదివాసీ.. ఆయన నుంచే మనమంతా వచ్చాం.. MP కాంగ్రెస్‌ MLA ఉమంగ్‌ వ్యాఖ్య

MLA Umang

ఇండోర్‌: హనుమంతుడి విషయంలో మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ‘హనుమాన్‌ ఆదివాసీ అయి ఉంటాడని అనుకుంటున్నా. మనం అందరం ఆయన నుంచే వచ్చామేమో’ అని ఎమ్మెల్యే ఉమంగ్‌ సింఘార్‌ శనివారం ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ అన్నారు.

గిరిజన నాయకుడు బిర్సా ముండా 123వ వర్థంతి సందర్భంగా ధార్‌ జిల్లాలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన ఉమంగ్‌.. రామాయణంలో వర్ణించిన వానరసేన.. వాస్తవానికి గిరిజనులని అన్నారు. అడవుల్లో జీవించే ఆదివాసీలు రాముడు లంకకు చేరేందుకు సహకరించారని చెప్పారు. వారినే వానరసేన అని చెబుతూ వచ్చారని పేర్కొన్నారు. అయితే.. ఇవన్నీ కథలేనని, హనుమంతుడు కూడా ఆదివాసీయేనని, మనమంతా ఆయన నుంచే వచ్చామని అన్నారు.

అపచారం.. అపచారం..

ఉమంగ్‌ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు ఒంటికాలిపై లేచారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి హితేశ్‌ బాజ్‌పాయ్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఇది అపచారమని అన్నారు. ‘హనుమంతుడిని వారు దేవుడిగా పరిగణించరు. హనుమాన్‌జీని హిందువులు కొలవడాన్ని కూడా వారు పరిగణించరు’ అని వ్యాఖ్యానించారు.

మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌, కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీలను ట్యాగ్‌ చేసిన బాజ్‌పాయ్‌.. హనుమాన్‌పై ఇది కాంగ్రెస్‌ అభిప్రాయమా? మీ మెప్పు పొందేందుకు మతమార్పిడులు చేసే క్యాథలిక్‌ మతగురువుల భాషను కాంగ్రెస్‌ మాట్లాడుతున్నదా? అని ప్రశ్నించారు. గిరిజనులు, గిరిజన సమాజం మనోభావాలను గాయపర్చినందుకు వెంటనే బాజ్‌పాయ్‌ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Exit mobile version