Nalgonda
విధాత: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సరూర్ నగర్ యువ సంఘర్షణ సభకు యువజన, విద్యార్థుల సమీకరణ దిశగా ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ నేతల్లో హడావుడి కానరాకపోవడం విస్మయం రేపుతుంది.
సాక్షాత్ ఏఐసిసి నేత ప్రియాంక గాంధీ హాజరుకానున్న ఈ సభలో నిరుద్యోగ డిక్లరేషన్ కూడా టీ.కాంగ్రెస్ ప్రకటించనున్న నేపథ్యంలో ఈ సభకు భారీగా యువజన, విద్యార్థులను తరలించాలని రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం భావించింది.
అందుకు అనుగుణంగా మాత్రం క్షేత్రస్థాయిలో ఆదివారం కాంగ్రెస్ శ్రేణుల్లో ఎలాంటి సందడి కనిపించలేదు. ఎక్కడ వాల్ పోస్టర్స్, ప్లెక్సీల హంగామా కానీ, జన సమీకరణల ఇన్చార్జిలు ఎవరన్న దానిపై స్పష్టత గానీ కాన రాలేదు.
నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎంపీలు ఉత్తంకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాసాల వద్ద కూడా సరూర్ నగర్ యువ సంఘర్షణ సభ సన్నాహాల సందడి కనిపించకపోవడం పార్టీ వర్గాలను ఆశ్చర్యపరిచింది.
యువ సంఘర్షణ సభకు జన సమీకరణకు ప్రత్యేక బాధ్యులను నియమించకపోవడంతో ఎవరికి వారుగా నియోజకవర్గాల నుండి సభకు తరలి వెళ్లేందుకు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర పార్టీ నుండి జన సమీకరణ ఏర్పాట్లు లేనందున తమ అనుచరులతో కలిసి తామే సొంత వాహనాల్లో నిరుద్యోగ సభకు బయలుదేరుతామని నాయకులు చెబుతున్నారు.
నిజానికి యువ సంఘర్షణ సభకు ప్రియాంక గాంధీ హాజరుకానున్న నేపథ్యంలో సభ విజయవంతం కోసం హైదరాబాద్ శివారు జిల్లాల నుండి భారీగా జన సమీకరణ చేస్తారని పార్టీ వర్గాలు అంచనా వేశాయి. అందుకు భిన్నంగా క్షేత్రస్థాయిలో జన సమీకరణ ఏర్పాట్లు లేకపోవడం చర్చనీయాంశమైంది.
కొంతవరకు యువజన, విద్యార్థి విభాగాల నాయకులు యువ సంఘర్షణ సభను విజయవంతం చేయాలంటూ మీడియా సమావేశాలు, సోషల్ మీడియా ప్రచారం, పోస్టర్ల ఆవిష్కరణలు నిర్వహించడంతో గుడ్డిలో మెల్లగా సరూర్ నగర్ సభకు కొంత ప్రచారం లభించినట్లు అయింది.
మరోవైపు ఇటీవల పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నిరుద్యోగ మార్చ్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్రలతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అంది వచ్చిన ఊపును, ఉత్సాహాన్ని కొనసాగించేలా యువ సంఘర్షణ సభకు జిల్లా నుండి భారీగా యువజన, విద్యార్థులను తరలించాల్సి ఉందన్న వాదన పార్టీ శ్రేణులలో వినిపిస్తుంది.
కాగా రేవంత్, భట్టి కార్యక్రమాల సందర్భంగా నియోజకవర్గాల్లో చెలరేగిన అసమ్మతి నేపథ్యంలో ప్రియాంక గాంధీ యువ సంఘర్షణ సభకు పార్టీ నాయకులు జనాన్ని తరలించడంలో ఎంత మేరకు ఆసక్తి చూపుతారన్నది కూడా సందేహంగానే ఉంది. రేవంత్, భట్టి కార్యక్రమాల్లో జన సమీకరణకు పోటీపడిన సీనియర్లు, టికెట్ ఆశావాహులు, యువ నేతలు సరూర్ నగర్ యువ సంఘర్షణ సభకు జన సమీకరణ దిశగా హడావుడి చేయకపోవడం పార్టీ శ్రేణులను నిరుత్సాహానికి గురిచేస్తుంది.
అయితే ఆదివారం రాత్రి నుండి సోమవారం ఉదయం కల్లా సరూర్ నగర్ సభకు జన సమీకరణ దిశగా కొంత కదలిక రావచ్చని పార్టీ వర్గాలు అంచనా వేస్తుండడం కేడర్ కు కొంత ఊరటనిచ్చేదిగా ఉంది.