Nalgonda | BRSకు షాక్‌.. కాంగ్రెస్‌లోకి చకిలం?.. రేవంత్ రాకతో చేరికల కాక!

Nalgonda విధాత: నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం BRS మాజీ నేత చకిలం అనిల్ కుమార్ కాంగ్రెస్ లోకి వెళ్తున్నారన్న ప్రచారం ఊపందుకుంది. పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి రేపు నల్గొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీలో నిర్వహించే నిరుద్యోగ నిరసన ర్యాలీకి హాజరయ్యే సందర్భంగా నల్గొండలోని దివంగత కాంగ్రెస్ నేత చకిలం శ్రీనివాసరావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించనున్నారు. ఈ సందర్భంగా తన అనుచరులు, మద్దతుదారులతో కలిసి చకిలం అనిల్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారన్న ప్రచారం జోరందుకుంది. […]

  • Publish Date - April 27, 2023 / 12:53 AM IST

Nalgonda

విధాత: నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం BRS మాజీ నేత చకిలం అనిల్ కుమార్ కాంగ్రెస్ లోకి వెళ్తున్నారన్న ప్రచారం ఊపందుకుంది. పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి రేపు నల్గొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీలో నిర్వహించే నిరుద్యోగ నిరసన ర్యాలీకి హాజరయ్యే సందర్భంగా నల్గొండలోని దివంగత కాంగ్రెస్ నేత చకిలం శ్రీనివాసరావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించనున్నారు.

ఈ సందర్భంగా తన అనుచరులు, మద్దతుదారులతో కలిసి చకిలం అనిల్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారన్న ప్రచారం జోరందుకుంది. ముందుగా నిర్ణయించిన మేరకు రేవంత్ రెడ్డి వెంట పార్టీ సీనియర్లు, ఎంపీలు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కె. జానారెడ్డి, ఆర్. దామోదర్ రెడ్డిలు హాజరు కావాల్సి ఉంది. వారందరూ హాజరైన పక్షంలో వారి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారన్న ప్రచారం వినిపిస్తోంది.

ఒక వేళ జిల్లాకు చెందిన సదరు సీనియర్లు అంతా రాని పక్షంలో తన చేరిక వాయిదా వేసుకోవచ్చని తెలుస్తుంది. ఇప్పటికే ఖమ్మం నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సైతం చకిలం అనిల్‌తో సంప్రదింపులు జరిపారు. పొంగులేటి రాజకీయ వ్యూహంలో భాగంగా ఆయన చకిలంతో పాటు కోదాడకు చెందిన BRS నేత కన్మంత రెడ్డి శశిధర్ రెడ్డి, నకిరేకల్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశంతో కూడా టచ్‌లో ఉన్నారని జిల్లా రాజకీయ వర్గాల్లో గట్టి ప్రచారమే సాగింది. అయితే వారంతా పొంగులేటి వెంటే సాగుతారా లేక తమకు ప్రయోజనకరంగా ఉండే సొంత నిర్ణయాల దిశగా వెళ్తారా అన్నది ఆసక్తి రేపుతుంది.

ఇక నలగొండ అసెంబ్లీ నియోజకవర్గంకు సంబంధించి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ప్రత్యామ్నాయంగా చకిలం అనిల్‌ను ప్రోత్సహించే వ్యూహంలో భాగంగా ఇప్పటికే రేవంత్ రెడ్డి ఆయనను కాంగ్రెస్‌లో చేరాలంటూ సంకేతాలు ఇచ్చారు. ఇదే నియోజకవర్గం నుంచి వెంకట్ రెడ్డికి ప్రత్యామ్నాయంగా ఇప్పటికే దుబ్బాక నరసింహ రెడ్డి కూడా టికెట్ రేసులో ఉండడంతో తాను ఆ పార్టీలో చేరితే రాజకీయ భవిష్యత్తు ఏమిటన్న దానిపై చకిలం అనిల్‌కు స్పష్టత లభించడం లేదు.

అటు బీజేపీ నుంచి కూడా చకిలంకు ఆహ్వానం అందింది. బీజేపీలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేరితే తన పరిస్థితి ఏమిటన్న దానిపై కూడా చకిలంలో అయోమయం రేపుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో భవిష్యత్తు రాజకీయాల దిశగా కాంగ్రెస్ నుంచి గట్టి హామీ లభిస్తే ఆ పార్టీలోకి వెళ్లాలంటూ అనిల్ కుమార్ కు ఆయన మద్దతుదారుల్లో మెజార్టీ వర్గీయులు సూచిస్తున్నారు.

ఇప్పటికే 22 ఏండ్లు BRSలో పనిచేసి నష్టపోయిన తనకు మళ్లీ అలాంటి రాజకీయ నష్టం వాటిల్లకుండా భవిష్యత్ రాజకీయాల దిశగా ఆచితూచి అడుగులేయాలని చకిలం అనిల్ నిర్ణయించుకున్నారు. మొత్తంగా తను ఏ పార్టీలో చేరాలన్న దానిపై రాజకీయ గందరగోళంలో ఉన్న చకిలం అనిల్ కుమార్ చివరకు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారన్న విషయం నియోజకవర్గ రాజకియాల్లో ఆసక్తికర అంశంగా మారింది.

Latest News