Nalgonda | కాంగ్రెస్ నేతలను పొలిమెరల్లోకి తరిమికొట్టాలి: మంత్రి జగదీష్‌రెడ్డి పిలుపు

Nalgonda విధాత: నల్గొండ జిల్లా ప్రజలను ఫ్లోరోసిస్ సమస్యల పాలు చేసిన కాంగ్రెస్ పాలకులు ఎన్నికల సమీపిస్తున్న వేళ కాలి యాత్రలు మోకాలు యాత్రలు అంటూ మరోసారి మోసం చేసేందుకు దండుగా వస్తున్నారని వారిని పొలిమెరల్లోకి తరిమికొట్టాలని మంత్రి జి.జగదీష్‌రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఇమాంపేట మిషన్ భగీరథ ప్లాంట్ ప్రాంగణంలో జరిగిన మంచి నీటి పండుగ సంబరాలలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడారు. సూర్యాపేటకు పాయాఖానా నీళ్లు తాపించిన ఘనత కాంగ్రెస్ పాలకులకు దక్కుతుందని […]

  • Publish Date - June 18, 2023 / 12:43 PM IST

Nalgonda

విధాత: నల్గొండ జిల్లా ప్రజలను ఫ్లోరోసిస్ సమస్యల పాలు చేసిన కాంగ్రెస్ పాలకులు ఎన్నికల సమీపిస్తున్న వేళ కాలి యాత్రలు మోకాలు యాత్రలు అంటూ మరోసారి మోసం చేసేందుకు దండుగా వస్తున్నారని వారిని పొలిమెరల్లోకి తరిమికొట్టాలని మంత్రి జి.జగదీష్‌రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఇమాంపేట మిషన్ భగీరథ ప్లాంట్ ప్రాంగణంలో జరిగిన మంచి నీటి పండుగ సంబరాలలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడారు.

సూర్యాపేటకు పాయాఖానా నీళ్లు తాపించిన ఘనత కాంగ్రెస్ పాలకులకు దక్కుతుందని ఎద్దేవా చేశారు. 2014 కు ముందు త్రాగు నీటి కోసం కుళ్ళాయిల వద్ద కొట్లాట, బిందెడు నీళ్ళకోసం తండ్లాట, గుక్కెడు నీటి కోసం ముష్టి ఘాతుకాలు, పోలీస్ స్టేషన్ల పాలు, కేసులు కాంప్రమైజ్ లు అంటూ వీధులపాలైన సందర్భాలను ఆయన ఉటంకించారు. అటువంటి దౌర్బగ్య స్థితి నుండి బయటపడి సురక్షితమైన నీటితో అభివృద్ధి, సంక్షేమంలో భాగస్వామ్యం అయిన ప్రజల్ని మోసం చేయడానికే యాత్రలు అంటూ ఆయన మండిపడ్డారు.

జీవనదులు పారుతున్నా, వాటిపై తెలంగాణకు హక్కులు ఉన్నా, సీమాంధ్ర నేతలకు దడుసుకుని గుక్కెడు నీళ్లతో గొంతులు తడపని నైజం నాటి కాంగ్రెస్ పాలకులదంటూ ఆయన విరుచుకుపడ్డారు. అటువంటి దుస్థితి నుండి బయటపడేసేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ 50 వేల కోట్లతో అత్యంత ప్రతిష్టాత్మకంగా టైం బౌండ్ తో చేపట్టిన మిషన్ భగీరథ పథకంతో ఇంటింటికి త్రాగు నీరు సరఫరా చేస్తున్నామన్నారు. అటువంటి సరఫరాలో ఒకటైన ఇమాంపేట ట్రీట్ మెంట్ ప్లాంట్ లో జరుగుతున్న మంచినీటి పండుగలో భాగస్వామ్యం అయినా వారు కాంగ్రెస్ నేతల వాగుడుకు చెక్ పెట్టాలని పిలుపునిచ్చారు.

మిషన్ భగీరధ నీటితోటే కాంగ్రెస్ పాలకులు పెంచి పోషించిన ఫ్లోరోసిస్ పాపాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ మటుమాయం చేశారన్నారు. ఒక్క సూర్యాపేట జిల్లాలోనే 917 కోట్లతో ఇంటింటికి సురక్షితమైన త్రాగు నీరు సరఫరా చేస్తుండగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 5102.39 వేల కొట్లతో 6 లక్షల 94 వేల24 ఇండ్లకు త్రాగు నీటి సరఫరా కొనసాగుతుందన్నారు. అటువంటి అద్భుతాలను మరచిపోయిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తొమ్మిదేళ్లలో ఏమి చేశారంటూ బిఆర్ఎస్ పై రాజకీయ విమర్శల దాడులకు పూనుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ గొంతుకలకు సమాధానం మూతి మీద కొట్టేలా ఉండాలి అంటూ ఘాటుగా విమర్శించారు.

కార్యక్రమంలో కలెక్టర్ వెంకట్రావు, మున్సిపల్ చైర్మన్ పెరుమాండ్ల అన్నపూర్ణమ్మ, గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు నిమ్మల శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ పుట్ట కిశోర్, జలసాధ‌న ఉద్యమ నేత దుశ్చర్ల సత్యనారాయణ, మిషన్ భగీరధ అధికారి సురేష్, జిల్లా ప్రజా పరిషత్ అధికారి సురేష్, మున్సిపల్ కమిషనర్ రామంజుల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.