Site icon vidhaatha

క‌దులుతున్న ‘న‌మ‌స్తే’ పునాదులు!


హైద‌రాబాద్‌: తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్ర ఉద్య‌మ స‌మ‌యంలో టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాన‌స‌పుత్రిక‌గా పుట్టిన న‌మ‌స్తే తెలంగాణ ప్ర‌స్తుతం చావుబ‌తుకుల మ‌ధ్య కొట్టుమిట్టాడుతున్న‌ట్టు స‌మాచారం. రాష్ట్రంలో అధికార‌మార్పిడి జ‌రిగిన వెంట‌నే ఈ ప‌రిణామం చోటు చేసుకోవ‌డం గ‌మ‌నార్హం. 2019 వ‌ర‌కు గ‌ణ‌నీయ‌మైన ప్ర‌గ‌తి సాధించిన ఈ ప‌త్రిక‌, త‌దుప‌రి ప‌రిణామాల మ‌ధ్య పూర్తిగా పార్టీ క‌ర‌ప‌త్రంగా మారి పాఠ‌కుల ఆద‌ర‌ణ కోల్పోయింద‌న్న‌ది వాస్త‌వం. త‌ద‌నంత‌రం జ‌రిగిన అన్ని ఎన్నిక‌ల్లో న‌మ‌స్తే ఎంత ఊద‌ర‌గొట్టినా టిఆర్ఎస్ ఓడిపోయింది(నాగార్జున‌సాగ‌ర్‌, మునుగోడు మిన‌హాయించి). ఈ రెండు ఉపఎన్నిక‌లు కావ‌డం, పార్టీ అధికార‌గ‌ణ‌మంతా అక్క‌డ మోహ‌రించ‌డం వాటి గెలుపుకు కార‌ణాలు.


ఇప్పుడు వ‌చ్చిన కొత్త ప్ర‌భుత్వం ఇక ప్ర‌క‌ట‌న‌లు ఇవ్వ‌దు కాబ‌ట్టి, ప‌త్రిక‌ను న‌డ‌ప‌డం క‌ష్ట‌మ‌నే భావ‌న‌తో కాస్ట్ క‌టింగ్ మొద‌లుపెట్టింది. ఇంకా అటువంటిదేమీ జ‌ర‌గ‌క‌ముందే, రేవంత్‌రెడ్డి ప్ర‌క‌ట‌న‌లు ఆప‌క‌ముందే, కేసీఆర్ ఆదేశాలు ఇవ్వ‌క‌ముందే యాజ‌మాన్యం తొంద‌ర‌ప‌డుతోంది. నిజానికి కొత్త ప్ర‌భుత్వం కొలువుదీరిన సంద‌ర్భంగా స‌మాచార‌,పౌర‌సంబంధాల‌శాఖ‌ ఇచ్చిన ప్ర‌క‌ట‌న‌లు న‌మ‌స్తేకు కూడా ల‌భించాయి.

ఎందుకోగానీ, ప‌త్రిక ‘ముఖ్యులు’ మాత్రం ఖ‌ర్చులు త‌గ్గించుకోవాల‌నే ఉబ‌లాటంతో, ముందుగా ఉద్యోగుల మీదే ప‌డ్డారు.


దాంతోపాటు, “న‌మ‌స్తే” మాత్ర‌మే ఇంకా ఇస్తున్న టాబ్లాయిడ్ల తీసివేత‌తో పాటు, కొన్ని ఎడిష‌న్ సెంట‌ర్ల‌ను కూడా శాశ్వ‌తంగా మూసివేయ‌నున్న‌ట్లు స‌మాచారం. వాటిలో ప్ర‌థ‌మంగా న‌ల్ల‌గొండ‌, వ‌రంగ‌ల్, నిజామాబాద్ ఉన్న‌ట్లు తెలుస్తోంది. నేటినుండి టాబ్లాయిడ్ల‌ను ఎత్తివేసి రెండు పేజీల‌ను మెయిన్‌లో బాగంగా జిల్లాల్లో ఇచ్చారు. హైద‌రాబాద్‌కు మాత్రం దీనినుండి మిన‌హాయింపు ల‌భించింది. వాస్త‌వానికి కంపెనీ ఆర్థిక ప‌రిస్థితి మ‌రీ ఎడిష‌న్లు మూసేసేంత‌గా ఏమీ లేదు. గ‌వ‌ర్న‌మెంటు యాడ్లు వ‌స్తేనే బ‌తికి బ‌ట్ట‌క‌డతార‌నే వాద‌న కూడా త‌ప్పే.


కంపెనీ ఆస్థిపాస్తుల విలువ కూడా ఇప్పుడు బాగానే పెరిగింది. దాదాపు 200 కోట్ల విలువైన ఆస్థులున్న‌ట్లు ఓ అంచ‌నా. క‌మ‌ర్షియ‌ల్ అడ్వ‌ర్ట‌యిజ్‌మెంట్లు కూడా ప‌త్రిక‌లో బాగానే వ‌స్తాయి. మ‌రి అటువంట‌ప్పుడు ప‌త్రిక‌ను బ‌ల‌హీన‌ప‌ర‌చుకోవ‌డం ఎంత‌వ‌ర‌కు స‌బ‌బో ప్ర‌ముఖుల‌కే తెలియాలి. ఈ నిర్ణ‌యాలేవీ కేసీఆర్‌కు తెలియ‌వ‌న్న‌ది ఉద్యోగుల మ‌నోగ‌తం. ఆయ‌న వ‌ర‌కు పోకుండా ప్ర‌ముఖులిద్ద‌రే ఈ త‌తంగాన్ని న‌డిపిస్తున్నార‌నేది జ‌ర్న‌లిస్టు స‌ర్కిళ్ల‌లో వినిపిస్తున్న లోపాయికారీ ముచ్చ‌ట‌. ఎటొచ్చి ఎటు తిరిగినా, యాజ‌మాన్యం దృష్టంతా జీతాలమీదే ఉంటుంద‌ని ఉద్యోగులు వాపోతున్నారు.


ఇప్పుడు ఉన్న ఉద్యోగుల్లో స‌గంమందిని ఇంటికి పంపే యోచ‌న‌లో యాజ‌మాన్యం ఉన్న‌ట్లు స‌మాచారం. ఇందులో అన్ని విభాగాల ఉద్యోగులు ఉన్నారు. గ‌తంలో ఇటువంటి ప‌రిస్థితే ఎదురైన‌ప్పుడు సిఎల్ రాజం ఆదుకుని సంస్థ‌ను భుజాల‌కెత్తుకుని న‌డిపించారు. ఆయ‌న హ‌యాంలోనే ప‌త్రిక పెరిగి పెద్ద‌దైంది. క‌రోనా కాలంలో అన్ని ప‌త్రిక‌ల ఆదాయం బాగా దెబ్బ‌తింది. న‌మ‌స్తే కూడా అందుకు మిన‌హాయింపు కాదు. త‌రువాత క్ర‌మంగా అన్నీ కోలుకున్నాయి ఒక్క ఆంధ్ర‌జ్యోతి త‌ప్ప‌.


ఇప్ప‌టికీ రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌భుత్వాల‌కు వ్య‌తిరేకంగా వార్త‌లు రాస్తూ, ఆయా ప్ర‌భుత్వాల నుండీ ఒక్క ప్ర‌క‌ట‌న రాకున్నా, ఆ ప‌త్రిక న‌డుస్తుందంటే కార‌ణం ప‌త్రిక ఎండీ రాధాకృష్ణ మొండి ప‌ట్టుద‌ల‌, ప‌త్రిక విలువ తెలిసిఉండ‌టం కార‌ణ‌మ‌నేది నిర్వివాదాంశం. ప్ర‌క‌ట‌న‌లు ఇవ్వ‌డం, ఇవ్వ‌క‌పోవ‌డ‌మ‌నేది ప్ర‌భుత్వం ఇష్టం. గ‌త ప్ర‌భుత్వం ఆంధ్ర‌జ్యోతి ప‌త్రిక‌కు ప‌దేళ్ల‌లో ఒక్క ప్ర‌క‌ట‌న కూడా ఇవ్వ‌క‌పోవ‌డం గ‌మ‌నించ‌ద‌గ్గ విష‌యం. ఎటొచ్చీ, ప్ర‌క‌ట‌న‌లు రాక‌పోతే ఇబ్బంది ప‌డేది మాత్రం ఉద్యోగులే, యాజమాన్యాలు కాదు. ఈ విష‌యం ప్ర‌భుత్వానికి కూడా తెలియంది కాదు.


ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో, బిఆర్ఎస్‌కు పత్రిక తోడు ఎంతో అవ‌స‌రం. త్వ‌ర‌లో ఎన్నిక‌లు మ‌ళ్లీ రాబోతున్నాయి. స్థానిక సంస్థ‌లు, పార్ల‌మెంటుకు జ‌రుగ‌బోయే ఎన్నిక‌ల్లో పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపి, యుద్ధానికి సిద్ధం చేయడానికి ప‌త్రిక ఎంత‌గానో దోహ‌ద‌ప‌డుతుంది. ఇదేకాక‌, ప్ర‌భుత్వం తీసుకునే ప్ర‌జావ్య‌తిరేక నిర్ణ‌యాల‌ను ఎండ‌గ‌ట్టే అద్భుత అవ‌కాశం కూడా ఇప్పుడు న‌మ‌స్తే ముందున్న‌ది. ఇటువంట‌ప్పుడు ప‌త్రిక‌ను ప‌త‌నం దిశ‌గా న‌డిపించ‌డం తెలివిత‌క్కువ‌త‌నం అనిపించుకుంటుంది. ఒక్క‌సారి తిరోగ‌మ‌నం వైపు ప్ర‌యాణం ప్రారంభ‌మైతే ప‌త్రిక మూత‌బ‌డ‌టానికి ఎక్కువ‌కాలం ప‌ట్ట‌దు.


‘తెలంగాణ టుడే’ అనే ఇంగ్లీషు ప‌త్రిక కూడా న‌మ‌స్తేకు అనుబంధంగా ఉంది. దాని పేరెవ‌రికీ తెలియ‌క‌పోయినా, ఆడంబ‌రం కోసం తెచ్చిన ప‌త్రిక అది. ఇప్పుడ‌ది న‌మ‌స్తే పాలిటి తెల్ల ఏనుగుగా మారింది. 50శాతం జీతాల‌ను త‌గ్గించాల్సిందిగా విభాగాధిప‌తుల‌కు మౌఖిక ఆదేశాలు జారీ అయిన‌ట్టు విశ్వ‌స‌నీయ స‌మాచారం. అంటే సగంమందిని ఇంటికి పంపాల్సిందిగా వారికి చెప్పిన‌ట్లు తెలిసింది. న‌మ‌స్తే ఈ ప‌రిస్థితికి రావ‌డ‌మ‌నేది నిజానికి యాజ‌మాన్యం స్వ‌యంకృతం.


బీఆర్ఎస్ అనుకూలంగా వార్త‌లు రాయ‌డ‌మ‌నేది వెగ‌టు పుట్టించే స్థాయికి చేరింద‌నేది స్వ‌యంగా ఆ పార్టీ నాయ‌కులే విధాత‌తో చెప్పిన సంద‌ర్భాలు అనేకం. ఒక విధంగా పార్టీ ప్ర‌తిష్ట‌ను గంగ‌పాలు చేసినవి కూడా ఈ రాత‌లే. ఇవే క్ర‌మంగా ప‌త్రిక‌ను ప్ర‌జ‌ల‌నుండి, నాయ‌కుల నుండి దూరం చేసాయి. ప‌త్రిక ఇప్పుడో అనాథ‌. యాజ‌మాన్యం త‌ర‌పునుండి ప‌ట్టించుకునే నాథుడేలేడు. కేసీఆర్ రంగ‌ప్ర‌వేశం చేసి, ఏం జ‌రుగుతోందో స్వ‌యంగా తెలుసుకుంటే త‌ప్ప ఈ ప‌త‌నం ఆగ‌దు.

Exit mobile version