Site icon vidhaatha

Medak: నూతన కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయ భవనాలు.. మే 20 నాటికి ప్రారంభానికి సిద్ధం చేయాలి

విధాత , ప్రత్యేక ప్రతినిధి: మెదక్ జిల్లా కేంద్రంలో నిర్మాణమ‌వుతున్న నూతన కలెక్టరేట్.. ఎస్పీ.. కార్యాలయాల నిర్మాణ పనులను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు, కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, ఇఫ్కా డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, ఇతర
ఇంజనీరింగ్ అధికారులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ మే 20 వ తేదీ వరకు కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయ భవన నిర్మాణ పనులను పూర్తి చేసి ప్రారంభానికి సిద్ద చేయాలని అధికారులను ఆదేశించారు.

కలెక్టరేట్ భవన నిర్మాణ పనులు ఇప్పటికే చాలా ఆలస్యమయ్యిందని, ప్రగతిలో ఉన్న ప్రహారి గోడ, సి.సి. రోడ్డు పనులు శరవేగంతో పూర్తి చేయాలని అన్నారు. రెసిడెన్షియల్ క్వార్టర్స్ లో పెయింటింగ్, శానిటరి ఫిట్టింగ్ వంటి మిగిలిపోయిన చిన్న చిన్న పనులను ముమ్మరం చేయాలని అన్నారు. 33 ఎకరాల విస్తీర్ణంలో సువిశాలంగా నిర్మిస్తున్న కలెక్టరేట్ ఆవరణ అంతా ల్యాండ్ స్కేపింగ్ చేసి పచ్చటి వాతావరణం కనిపించేలా చక్కటి బయళ్లు ఏర్పాటుతో పాటు మొక్కలు నాటాలని, మీడియన్ లో చక్కటి మొక్కలు పెంచాలని సూచించారు.

అదేవిధంగా సివిల్ పనులు మొత్తం పూర్తైన జిల్లా పోలీసు కార్యాలయంలో ఫాల్ సీలింగ్, పెయింటింగ్, ఎలక్ట్రికల్ పనులు, సి.సి. రోడ్లు, ప్రహారి గోడ నిర్మాణ పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు. ఎస్పీ క్వార్టర్స్ చుట్టూ ప్రహారి గోడ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామన్నారు.

అనంతరం రహ‌దారులు, భవనాల శాఖ ద్వారా మెదక్, నరసాపూర్, అందోల్, నారాయణఖేడ్, దుబ్బాక, గజ్వెల్ నియోజక వర్గాలలో చేపట్టిన బి.టి. రోడ్ల పునరుద్ధరణ పనుల ప్రగతిని సమీక్షిస్తూ 2021-22 సంవత్సరంలో 16 కోట్ల 20 లక్షల వ్యయంతో 46 కిలో మీటర్ల అభివృద్ధికి 9 పనులు, 2022-23 లో 49 కోట్ల వ్యయంతో 86 కిలో మీటర్ల అభివృద్ధికి 13 పనులు చేపట్టుటకు వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని మంత్రి ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు.

స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ క్రింద గిరిజన తండాలలో బి.టి. రోడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ పథ‌కం క్రింద మెదక్ నియోజక వర్గంలో 43 కోట్ల 77 లక్షల వ్యయంతో 42 .55 కిలో మీటర్ల రహ‌దారి నిర్మాణానికి 25 పనులు, నరసాపూర్ నియోజక వర్గంలో 64 కోట్ల 17 లక్షల వ్యయంతో 81.21 కిలో మీటర్ల రహదారి నిర్మాణానికి 30 పనులు, నారాయణఖేడ్ నియోజకవర్గంలో సుమారు 2 కోట్ల వ్యయంతో 3 కిలో మీటర్ల రహ‌దారి నిర్మాణానికి 2 పనులు చేపట్ట‌డానికి వెంటనే టెండర్లు ఆహ్వానించవలసినదిగా మంత్రి ఆదేశించారు.

ఎస్.సి. స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ క్రింద మెదక్ పట్టణంలోని రాందాస్ చౌరస్తా నుండి దయారా వరకు 2 కిలో మీటర్ల రహ‌దారి నిర్మాణానికి 7 కోట్ల 80 లక్షలు మంజూరు చేశామని, ఈ పనులు కూడా కాంట్రాక్టర్ వెంటనే చేపట్టేలా టెండర్లు పిలవవలసినదిగా సూచించారు. కలెక్టర్, ఎమ్మెల్యే ఇంజనీరింగ్ అధికారులు సమావేశమై త్వరగా టెండర్లు ఫైనల్ చేసి ప్రతి నియోజక వర్గంలో పనులు ప్రారంభించేలా తక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాజర్షి షా కు సూచించారు.

సమావేశంలో ఆర్ అండ్ బి సూపెరింటెండెయింగ్ ఇంజనీర్, కార్యనిర్వాహక ఇంజనీరు, ఏజెన్సీ ప్రతినిధి రమేష్ చాబ్రా, పొలిసు శాఖ నుండి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version