Site icon vidhaatha

డైనోసార్ల అంతానికి కార‌ణం ఆస్ట‌రాయిడ్ కాదు.. అస‌లు కార‌ణానికి సాక్ష్యాలు భార‌త్‌లోనే!

విధాత‌: కొన్ని కోట్ల సంవ‌త్స‌రాల పాటు భూమిపై రాజ్య‌మేలిన డైనోసార్లు (Dinosaurs Extinction) త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాల్లో అంత‌రించిపోయిన విష‌యం తెలిసిందే. ఇలా జ‌ర‌గ‌డానికి భూమిని ఒక గ్ర‌హ‌శ‌కలం ఢీకొట్ట‌డ‌మే కార‌ణ‌మ‌ని చాలా మంది శాస్త్రవేత్త‌లు భావిస్తున్న‌ప్ప‌టికీ అది ఒక అంచ‌నా మాత్ర‌మే. దీనికి స‌మాంత‌రంగా మ‌రికొన్ని సిద్ధాంతాలూ ప్ర‌చారంలో ఉన్నాయి. వాటిపై ఇప్ప‌టికీ ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతున్నాయి.


డైనోసార్లు అంత‌రించిపోయిన 6.6 కోట్ల సంవ‌త్స‌రాల క్రితం.. భూమిపై విష‌వాయువులు విప‌రీతంగా పెరిగిపోయాయ‌ని.. అదే డైనోసార్ల అంతానికి కార‌ణ‌మ‌ని తాజా ప‌రిశోధ‌నలో క‌నుగొన్న‌ట్లు శాస్త్రవేత్త‌లు చెబుతున్నారు. ప‌లువురు అంత‌ర్జాతీయ శాస్త్రవేత్త‌లు జ‌రిపిన ప‌రిశోధ‌న ప్ర‌కారం… డైనోసార్ల చివ‌రి కాలంలో వాతావ‌ర‌ణంలో స‌ల్ఫ‌ర్ స్థాయులు చాలా వేగంగా పెరిగిపోయాయని.. దీంతో భూమి ఇంచుమించుగా న‌ర‌కానికి న‌కలుగా మారింద‌ని అధ్య‌య‌నంలో పేర్కొన్నారు.


దీనితో పాటు పాద‌ర‌సం స్థాయులు కూడా పెరిగిపోవ‌డానికి అగ్ని ప‌ర్వ‌తాలు విప‌రీతంగా బ‌ద్ద‌లు కావ‌డ‌మేన‌ని భావిస్తున్నారు. ఈ విష‌వాయువుల వ‌ల్ల ప‌ర్యావ‌ర‌ణం పూర్తిగా దెబ్బ‌తింద‌ని.. వాతావర‌ణాన్ని క‌ప్పేసింద‌ని చెబుతున్నారు. ఈ ప‌రిణామాలే రాక్ష‌స‌బ‌ల్లుల అంతానికి దోహ‌ద‌ప‌డ్డాయ‌ని స్ప‌ష్టం చేశారు. అయితే ఇదే వాద‌న‌ను 1991లోనే ప్ర‌తిపాదించిన‌ప్ప‌టికీ.. అప్పుడు మేధావులు అంద‌రూ ఆస్ట‌రాయిడ్ వాద‌న‌నే స‌మ‌ర్థించారు. అయితే తాజా ప‌రిశోధ‌న‌ల్లో ఆస్ట‌రాయిడ్ ప్ర‌మాదం వ‌ల్ల కంటే ఈ విష‌వాయువుల ప్ర‌తిపాద‌నే స‌మంజ‌సంగా అనిపిస్తోంద‌ని నిపుణులు చెబుతున్నారు.


భార‌త్‌లోనే ప‌రిశోధ‌న‌లు


ఈ ప్ర‌తిపాద‌న‌ను బ‌ల‌ప‌రిచే సాక్ష్యాలు భార‌త్‌లోనే ఉండ‌టం విశేషం. ప‌రిశోధ‌న‌లో భాగంగా శాస్త్రవేత్త‌ల బృందం ప‌శ్చిమ భార‌తంలోని డెక్క‌న్ ట్రాప్స్‌ను ప‌రిశీలించింది. ఇవి అగ్ని ప‌ర్వ‌త విస్ఫోటాల ద్వారా ఏర్ప‌డిన‌వే కావడంతో వీటిలోని స‌ల్ఫ‌ర్ సాంధ్ర‌త‌ను ప‌రిశీలించారు. ఈ గ‌ణాంకాలు కంప్యూట‌ర్ సిమ్యేలేష‌న్‌లో పెట్టి చూడ‌గా.. భూమిపై జీవాన్ని నాశ‌నం చేసేంత స్థాయిలోనే అప్ప‌ట్లో సల్ఫ‌ర్ విడుద‌లైన‌ట్లు నిర్ధారించారు.


కేవ‌లం రాజ‌స్థాన్ ప్రాంతంలో అగ్ని ప‌ర్వ‌త విస్ఫోటాల ద్వారానే 10 ల‌క్ష‌ల క్యూబిక్ కి.మీ. రాయి ఉద్భ‌వించింద‌ని అంచ‌నా వేశారు. అంటే ఎంత మొత్తంలో విష‌వాయువులు విడుద‌లై ఉంటాయో ఊహించొచ్చ‌ని వారు పేర్కొన్నారు. ఇక్క‌డి థాకుర్‌వాడీ నుంచి బుషే వ‌ర‌కు ఉన్న ప్రాంతంలో స‌ల్ఫ‌ర్ అధిక మొత్తంలో ఉంద‌ని వారు పేర్కొన్నారు. క్రెటాషియ‌స్ కాలానికి ఈ డెక్క‌న్ ట్రాప్స్ వ‌య‌సుకు స‌రిగ్గా స‌రిపోతోంద‌ని పేర్కొన్నారు.


ఈ ప‌రిణామాల‌ను బ‌ట్టి చూస్తే.. డైనోసార్ల అంతానికి కార‌ణ‌మైంద‌న్న ఆస్ట‌రాయిడ్ రావ‌డానికి 10 వేల ఏళ్ల ముందే భూ ఉష్ణోగ్ర‌త‌లు 10 డిగ్రీల సెంటీగ్రేడ్ పెరిగిపోయాయ‌ని వారు పేర్కొన్నారు. ఆస్ట‌రాయిడ్ రావ‌డానికి ముందే భూమిపై వాతావ‌ర‌ణం చాలా అస్త‌వ్య‌స్తంగా ఉంది. అగ్ని ప‌ర్వ‌తాల బూడిద వాతావ‌ర‌ణాన్ని క‌ప్పేయ‌డంతో.. ద‌శాబ్దాల పాటు అతి శీత‌ల‌, అతి ఉష్ణ ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. అప్ప‌టి నుంచే డైనోసార్ల అంతం ప్రారంభ‌మైంది అని మెక్ గిల్ యూనివ‌ర్సిటీ జియో కెమిస్ట్ డాన్ బేక‌ర్ వివ‌రించారు.

Exit mobile version