Bharat | ఈ ‘దేశం’ ఎటు పోతుందో? రిపబ్లిక్ ఆఫ్‌ ఇండియా కాదు.. రిపబ్లిక్‌ ఆఫ్‌ భారత్‌!

Bharat | దేశం పేరు మార్చే ప్రయత్నాల్లో కేంద్ర ప్రభుత్వం? జీ 20 విందు ఆహ్వానంలో ‘ప్రెసిడెంట్‌ ఆఫ్‌ భారత్‌’ అధికారిక కార్యక్రమంలో వాడుక ఇదే మొదటిసారి సామాజిక మాధ్యమాల్లో వైరలైన ఆహ్వాన పత్రిక అసోం ముఖ్యమంత్రి శర్మ ట్వీట్‌తో దేశంలో కల్లోలం సమస్యలపై చర్చించకుండా.. పేరు మార్పుపై రగడ గతంలో నెహ్రూ స్మారక మ్యూజియం పేరు మార్పు నేర చట్టాలకూ సహింతలుగా నామకరణకు యత్నం ‘భారత్‌’ అని పిలవాలన్న ఆరెస్సెస్‌ చీఫ్‌ భాగవత్‌ నాలుగు రోజులకే […]

  • Publish Date - September 5, 2023 / 01:39 PM IST

Bharat |

  • దేశం పేరు మార్చే ప్రయత్నాల్లో కేంద్ర ప్రభుత్వం?
  • జీ 20 విందు ఆహ్వానంలో ‘ప్రెసిడెంట్‌ ఆఫ్‌ భారత్‌’
  • అధికారిక కార్యక్రమంలో వాడుక ఇదే మొదటిసారి
  • సామాజిక మాధ్యమాల్లో వైరలైన ఆహ్వాన పత్రిక
  • అసోం ముఖ్యమంత్రి శర్మ ట్వీట్‌తో దేశంలో కల్లోలం
  • సమస్యలపై చర్చించకుండా.. పేరు మార్పుపై రగడ
  • గతంలో నెహ్రూ స్మారక మ్యూజియం పేరు మార్పు
  • నేర చట్టాలకూ సహింతలుగా నామకరణకు యత్నం
  • ‘భారత్‌’ అని పిలవాలన్న ఆరెస్సెస్‌ చీఫ్‌ భాగవత్‌
  • నాలుగు రోజులకే బయటకు వచ్చిన కేంద్రం యత్నం
  • ఆరెస్సెస్‌ పథకాన్ని పక్కాగా అమలు చేస్తున్న బీజేపీ

దేశం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారాల కోసం జనం ఎదురు చూస్తుంటే, విధ్వంసానికి గురవుతున్న రాజ్యాంగ సంస్థలను రక్షించాలని బుద్ధిజీవులు ప్రయత్నిస్తుంటే.. కేంద్ర ప్రభుత్వ దర్యప్తు సంస్థలను నిర్వీర్యం చేసే ప్రయత్నాలను నిరోధించాలని ప్రతిపక్షాలు ఏకమవుతుంటే.. కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ మాత్రం పేర్ల మార్పిడితో రాజకీయం చేస్తూ జనాన్ని మభ్యపెట్టే పనిలో నిమగ్నం అయినట్టు కనిపిస్తున్నది. ఇప్పటికే వివిధ నగరాలు, రహదారుల పేర్ల మార్పిడితో మొదలై.. నెహ్రూ స్మారక మ్యూజియం వంటి ప్రఖ్యాత సంస్థలకు పాకి.. నేర చట్టాల్లోకి చొరబడి.. ఇప్పుడు దేశం పేరు మార్చే స్థాయికి చేరుకున్నది. ఇండియా పేరు ‘భారత్‌’గా మార్చే అవకాశాలు ఉన్నాయన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఇది కేవలం ప్రతిపక్షాలు తమ కూటమికి ‘ఇండియా’ అనే పేరు పెట్టుకోవడాన్ని సహించలేక వేసిన ఎత్తుగడా? లేక.. ఆరెస్సెస్‌ బాటలో పకడ్బందీగా అడుగులు వేస్తూ.. దేశాన్ని హిందూ రాష్ట్రంగా మలిచే దుస్సాహసం చేస్తున్నదనేందుకు సంకేతమా? అసలు ఈ దేశం ఎటు పోతున్నది?

న్యూఢిల్లీ: మన దేశాన్ని అంతర్జాతీయ స్థాయిలో ఇండియాగా పిలిచే పరిభాషను ‘భారత్‌’ అని మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందా? రాబోయే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ఈ మేరకు బిల్లు తీసుకురానున్నదా? తాజా పరిణామాలు గమనిస్తే అవుననే సమాధానాలే వస్తున్నాయి.

భార‌త్ అధ్య‌క్ష‌త‌న ఈ వారాంతంలో జీ-20 శిఖ‌రాగ్ర స‌ద‌స్సు జ‌ర‌గ‌నుంది. ఈ స‌మావేశానికి ప్ర‌పంచ వ్యాప్తంగా ప‌లు దేశాల అధినేత‌లు, అధ్య‌క్షులు, ప్ర‌ధాన‌మంత్రులు హాజ‌రు కానున్నారు. వారికి రాష్ట్ర‌ప్ర‌తి ద్రౌప‌ది ముర్ము ఈ నెల 9వ తేదీన ప్ర‌త్యేక విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు ఆహ్వానించే లేఖ‌ల‌పై ‘ది ప్రెసిడెంట్ ఆఫ్ భార‌త్’ అని రాశారు. దీంతో అనుమానాలకు రేగాయి.

అదే కాకుండా.. జీ-20 స‌ద‌స్సు కోసం రూపొందించిన బుక్‌లెట్‌లోనూ దేశం పేరు భార‌త్ అని పేర్కొన్నారు. ‘భార‌త్, మ‌ద‌ర్ ఆఫ్ డెమోక్ర‌సీ’ అని అందులో రాశారు. ఇది రాజకీయంగా దుమారం సృష్టించింది. దీనిని కాంగ్రెస్‌ ఖండించిన వెంటనే అసోం సీఎం హేమంత్‌ బిశ్వశర్మ.. ‘రిపబ్లిక్‌ ఆఫ్‌ ఇండియా’ పేరును ‘రిపబ్లిక్‌ ఆఫ్‌ భారత్‌’ అని మార్చబోతున్నట్టు చేసిన ట్వీట్‌తో ప్రకంపనలు రేగాయి.

ప్రత్యేక పార్లమెంటు సమావేశాల ప్రకటన వెలువడినప్పుడు ప్రభుత్వం జమిలి ఎన్నికకు బిల్లు తెస్తుందని, ముందస్తు లేదా ఐదు రాష్ట్రాల ఎన్నికల వాయిదా ఉంటుందని ఊహాగానాలు చెలరేగాయి. ఆ సమయంలో ఒక ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన కేంద్రమంత్రి అనురాగ్‌.. ప్రభుత్వానికి ‘పెద్ద ఆలోచనలే’ ఉన్నాయని చెప్పడం ఇక్కడ ప్రస్తావనార్హం.

‘భారత్‌’ అని వాడటం ఇదే తొలిసారి

ఒక అంతర్జాతీయ అధికారిక కార్యక్రమం సందర్భంలో ‘ఇండియా’ బదులు ‘భారత్‌’ అనే పరిభాష ఉపయోగించడం ఇదే మొదటిసారి అని అధికారులు చెబుతున్నారు. జీ20 సదస్సుకు హాజరయ్యే ప్రముఖులకు ఇచ్చే విందుకు సంబంధించి ప్రెసిడెంట్‌ ఆఫ్‌ భారత్‌ అని ఉన్న ఆహ్వాన పత్రికను ప్రముఖ పాత్రికేయుడు రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ సహా అనేక మంది సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేశారు. ప్రతిపక్ష కాంగ్రెస్‌ ఈ ప్రయత్నాలను ఖండించగా, బీజేపీ నేతలు స్వాగతిస్తున్నారు.

రాష్ట్రాల సమాహారంపై దాడి : జైరాం రమేశ్‌

‘బహుశా ఇది నిజమేనేమో! ప్రెసిడెంట్‌ ఆఫ్‌ ఇండియా బదులు.. ప్రెసిడెంట్ ఆఫ్‌ భారత్‌ పేరుతో సెప్టెంబర్‌ 9న జరిగే జీ20 దేశాల నేతలకు ఇచ్చే విందు సమావేశానికి ఆహ్వానాన్ని రాష్ట్రపతి భవన్‌ పంపింది. ఇప్పుడు మనం ఒకసారి రాజ్యాంగంలోని ఒకటవ అధికరణాన్ని చదువుకోవాలి. ‘భారత్‌.. అంటే ఇండియా రాష్ట్రాల సమాహారంగా ఉంటుంది’. కానీ.. ఇప్పుడు ఈ రాష్ట్రాల సమాహారం దాడికి గురవుతున్నది’ అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

రిపబ్లిక్‌ ఆఫ్‌ భారత్‌ : హేమంత బిశ్వ శర్మ

ఈ అంశంపై మొదటిగా స్పందించినవారిలో అసోం సీఎం హేమంత బిశ్వ శర్మ కూడా ఒకరు. ఓ అడుగు ముందే వేసిన శర్మ.. ‘రిపబ్లిక్‌ ఆఫ్‌ భారత్‌- అమృత్‌కాల్‌ దిశగా సాహసంతో మన నాగరికత అడుగులు వేస్తున్నందుకు సంతోషంగా, గర్వంగా ఉన్నది’ అని ట్వీట్‌ చేశారు.

ప్రత్యేక సమావేశాల్లోనే బిల్లు?

18 నుంచి 21 వరకు జరిగే మూడు రోజుల పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో దేశ పేరు మార్పిడి అంశంపై బిల్లు తెచ్చే అవకాశాలు ఉన్నాయన్న చర్చ జోరందుకున్నది. నిజానికి దేశం పేరును ఇండియా బదులు భారత్‌ అని రాయాలని, పలకాలని ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ ప్రతిపాదించిన నాలుగు రోజులకు ఈ ఆహ్వాన పత్రిక వెలుగు చూడటం గమనిస్తే.. ఇదంతా పక్కా ప్రణాళిక ప్రకారం ఆరెస్సెస్‌ కనుసన్నల్లోనే నడుస్తున్నదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

ప్రతిపక్షాలపై అక్కసుతోనే?

మోదీకి వ్యతిరేకంగా విశాల ఐక్య వేదికను నిర్మస్తున్న ప్రతిపక్షాలు తమ కూటమికి ఇండియన్‌ నేషనల్‌ డెవలప్‌మెంటల్‌ ఇన్‌క్లూజివ్‌ అలయెన్స్‌.. (ఐఎన్‌డీఐఏ) అని నామకరణం చేసుకోవడం కూడా మోదీ సర్కారుకు ఇబ్బదికరంగా మారింది. గతంలో కాంగ్రెస్‌ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని లేదా కూటమిని విమర్శించేటప్పుడు యూపీఏ ప్రభుత్వం, యూపీఏ అంటూ మాట్లాడగా.. ఇప్పుడు ఇండియా అని ఉచ్ఛరించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇండియాను విమర్శించడం అంటే.. దేశాన్ని విమర్శించినట్టు అనిపించే పరిస్థితి కూడా నెలకొన్నది. ఈ క్రమంలోనే ప్రతిపక్షాలకు గట్టి జవాబు ఇచ్చేందుకే మోదీ ఈ చర్యకు పాల్పడ్డారన్న అనుమానాలు కూడా ఉన్నాయి. అదే సమయంలో ఇండియా కూటమికి మోదీ భయపడుతున్నారన్న అభిప్రాయాన్ని కూడా పలువురు వ్యక్తం చేస్తున్నారు.

సమస్యలన్నింటినీ పక్కదారి పట్టించేందుకే?

అన్నింటికి మించి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక మైండ్‌ గేమ్‌ అడుతున్నదనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. మోదీ ప్రభుత్వం గత తొమ్మిదేళ్లలో ఇచ్చిన హామీలేవీ సాకారం కాలేదు. రైతులకు వ్యవసాయ ఆదాయం 2022 నాటికి రెట్టింపు అవుతుందన్నా.. అతీగతీ లేదు. అదే ఏడాదిలో దేశ ప్రజలందరికీ ‘ఘర్‌.. ఘర్‌మే నల్‌.. నల్‌ మే జల్‌..’ అంటూ మాటలతో ఊదరగొట్టినా.. ఇప్పటికీ పేదలకు ఇండ్లు అందిందీ లేదు! ఇక నిరుద్యోగిత రికార్డు స్థాయికి చేరుకున్నది. ధరల పెరుగుదల సామాన్య, మధ్యతరగతి ప్రజలకు పెను భారంగా పరిణమించింది.

గ్యాస్‌ ధర తగ్గించినా.. ఆరేడు వందలు పెంచి.. రెండు వందలు తగ్గించిన తీరు మోదీ సర్కారు తీరుపై భ్రమలు తొలగిపోయేందుకు ఒక అంశంగా నిలిచింది. ఇవన్నీ ప్రజల మనసుల్లో సజీవంగా ఉండకుండా చూడటమే బీజేపీ సర్కారు ఆలోచనగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రజలు, మేధావులు, రాజకీయ పార్టీలు ఈ సమస్యల గురించి మాట్లాడకుండా చేసి.. ఒక అజెండా సృష్టించి.. పేర్లు మార్చడం సబబా? కాదా? అనే చర్చల్లో కూరుకుపోవాలనేదే మోదీ ఎత్తుగడ అనే అభిప్రాయాలు కూడా వెలువడుతున్నాయి.

ఈ క్రమంలోనే ఢిల్లీలోని పలు వీధులకు పేర్ల మార్పు, పలు నగరాల పేర్లు మార్పుతోపాటు.. నెహ్యూ స్మారక మ్యూజియం వంటివాటి పేర్లను మార్చడం, ఇటీవల నేర చట్టాలను సంహితలుగా మార్చే పన్నాగాలకు మోదీ పాల్పడ్డారని అంటున్నారు. మోదీ చర్యలన్నీ తన వైఫల్యాలపై ప్రజలు చర్చించుకోకుండా చూడటమేనని గుర్తించాల్సిన అవసరం ఉన్నదని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.

Latest News